నా ఆడియో నాకే వినిపించారంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు
Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర నేతలే ఈ లిస్టులో ఉండగా.. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్ నేతల ఫోన్లూ ట్యాప్ చేసినట్లు విచారణలో బయటపడుతోంది. అప్పటి వైసీపీ మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతల ఫోన్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజమేనని, అంతేగాక అది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన రాజకీయ కుట్ర అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాంబ్ పేల్చారు. బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ వ్యవహారం వెనుక జగన్-కేసీఆర్ జాయింట్ ఆపరేషన్ ఉందని బలంగా ఆరోపించారు.
“2018-19 పొలిటికల్ పీరియడ్‌లో కేసీఆర్ తెలంగాణ సీఎంగా, జగన్ ఏపీ సీఎంగా చాలా సన్నిహితంగా ఉండేవారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ ఈ ఇద్దరి కలయికతోనే జరిగిందని నాకు స్పష్టంగా తెలుసు,” అని షర్మిల ఆరోపించారు. అంతేకాదు, తన ఫోన్‌తో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని తాను స్పష్టంగా అనుభవించినట్టు చెప్పారు.
నా ఆడియోలు నాకే వినిపించారు..!
“వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ‘మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి’ అని చెప్పారు. నేను మాట్లాడిన ఫోన్ సంభాషణ నాకే వినిపించింది. ఇదేంటి? ఇది చట్ట విరుద్ధం కాదు అంటే మరేంటీ?” అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. “ఈ విషయం పై ఆయన ఇప్పుడు ఒప్పుకుంటారా? లేదా అనే అనుమానం నాకు ఉంది. కానీ నేను మాత్రం ఏదైనా విచారణలో బైబిల్ మీద కానీ, నా పిల్లల మీద కానీ ప్రమాణం చేసి చెప్పగలను” అని స్పష్టం చేశారు.
తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ కుట్ర పన్నారని షర్మిల ఆరోపించారు. “నన్ను ఆపలేకే… నన్ను ఊపిరి తీసుకోకుండా చేసేందుకు చేసిన కుట్ర ఇది. నన్ను కలిసిన వాళ్లను బెదిరించడం ద్వారా నన్ను ఒంటరిని చేసే ప్రయత్నం జరిగింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు పోరాడతా..
“అప్పుడు చెప్పలేకపోయాను. ఎందుకంటే రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాల మధ్య ఇది చిన్న విషయం అనిపించింది. కానీ ఇప్పుడు చెబుతున్నా. ఫోన్ ట్యాపింగ్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధం. అవసరమైతే ఆస్తుల పంచిన రోజే ఫిర్యాదు చేసేదాన్ని,” అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.
“అప్పుడు పోరాడలేకపోయాను. కానీ ఇప్పుడు తలెత్తి నిలబడేందుకు, తప్పును నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రజలు కూడా నిజం తెలుసుకోవాలి,” అంటూ వైఎస్ షర్మిల వెల్లడించారు.
పీసీసీ చీఫ్ షర్మిల బుధవారం హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం, రోడ్డు మార్గంలో అరకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఆరోపణలతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టించారు