
Amaravathi: ఏపీలో మద్యం కుంభకోణంలో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు గురించి సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఇప్పుడే కాదు గతంలోనూ ఈ ఇద్దరూ డబ్బు కోసం అడ్డదారులు తొక్కారని.. అండర్ వరల్డ్ మాఫియాతోనూ సంబంధాలు నెరిపారని ఆరోపణలొస్తున్నాయి. 24 ఏళ్ల క్రితం.. అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలేం, అతని ప్రియురాలు మోనికా బేడీ గురించి అందరికీ తెలిసిందే. అయితే మద్యం కుంభకోణం డొంక కదులుతుండటంతో ఈ మాఫియాతో కృష్ణ మోహన్ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఉన్న లింకుల సంగతి బయటపడుతోంది. మాఫియా క్రిమినల్స్‌కు దొంగ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి దేశం దాటేందుకూ ఈ ఇద్దరు సహకరించినట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ సీఎం జగన్ ఓఎస్‌డీ పెళ్లకూరు కృష్ణ మోహన్ రెడ్డి 2001లో కర్నూలు తహసీల్దార్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే దేశాన్ని మాఫియా డాన్ అబూ సలేం కేసు కుదిపేసింది. 1993 నాటి ముంబై పేలుళ్ల ఘటనలో కీలక పాత్రదారి, భారత్‌లో దేశద్రోహానికి సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అబూసలేం.. అతని ప్రియురాలు మోనికా బేడిని 2002లో పోర్చుగల్‌లో అక్కడి పోలీసులు పట్టుకున్నారు. భారత్ నుంచి ఎలా తప్పించుకున్నారనే విషయంపై ఆరా తీసిన పోలీసులకు జాడ కర్నూలులో దొరికింది.

అబూసలేం ప్రియురాలు, మోడల్ మోనికా బేడికి సనా మాలిక్ కమల్ పేరుతో 2001 ఏప్రిల్ 9న కర్నూలులోని బాబూ గౌండ వీధిలో నివాసముంటున్న ఓ ఫేక్ ధ్రువీకరణ పత్రం జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దానితోనే అబూ సలేం అనుచరులతో పాటు అతనికీ ఫేక్ పాస్‌పోర్టులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు తయారు చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ సమయానికి ఎమ్మార్వోగా కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు. దీనిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేయగా.. అది సీబీఐకి బదిలీ అయింది. అయితే సనా మాలిక్ పేరిట నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది అప్పటి కర్నూలు ఎస్పీ పీఎస్ఆర్ ఆంజనేయులుగా గుర్తించిన సీబీఐ అధికారులు ఆయన్ని విచారించినా.. పలుకుబడితో ఆయన తప్పించుకున్నారు. అయితే, తనకు ఎలాంటి సంబంధం లేదని.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా ఉన్న మహ్మద్ యూనస్ ఇచ్చిన నివేధిక ఆధారంగానే నివాస ధ్రువీకరణ పత్రం జారీచేశానని చెప్పి కృష్ణ మోహన్ రెడ్డి సైతం తప్పించుకుని సీబీఐకి సాక్షిగా మారాడు.
ఇప్పుడు మద్యం కుంభకోణాన్ని కూటమి సర్కారు సీరియస్‌గా తీసుకోవడం.. వెంటవెంటనే అరెస్టులు చేస్తుండటంతో నిందితులకు సంబంధించిన ఒక్కో విషయం బయటికి వస్తోంది. ఈ కుంభకోణంలో భాగం పంచుకున్న అప్పటి అధికార వైసీపీ నేతలతో పాటు అధికారులనూ పక్కా ఆధారాలతో జైలుకు పంపేందుకు దర్యాప్తు ముమ్మరమైంది.