WTC: 27 ఏళ్లుగా ప్రపంచకప్ క్రికెట్‌లో అన్‌లక్కీ జట్టుగా పడిన ముద్రను పటాపంచలు చేసింది దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు. వరుస వైఫల్యాలను దాటుతూ భీకర పోరులో గెలిచి సఫారీ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్‌తో చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన మూడో జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది.
1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ విజయానికి తర్వాత, సఫారీ జట్టు గెలిచిన తొలి మేజర్ టైటిల్ ఇది. గత టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైన ఈ జట్టు ఈసారి అద్భుత ప్రదర్శనతో టైటిల్ దక్కించుకుంది.
ఆసీస్‌పై గెలిచిన సఫారీ జట్టు
లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్‌పై విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు, నాలుగో రోజు తొలి సెషన్‌లో 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి గెలుపొందింది.

ఈ విజయానికి ప్రధాన కారణం ఐడెన్ మార్క్రమ్ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్. మార్క్రమ్ 207 బంతుల్లో 136 పరుగులు చేస్తూ జట్టును విజయానికి దగ్గర చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటైన అతను, రెండో ఇన్నింగ్స్‌లో అదిరిపోయే బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. అతను ఔటయ్యే సమయానికి జట్టు గెలిచేందుకు కేవలం 6 పరుగులే అవసరం.
సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా జట్టు గెలుపులో కీలకంగా నిలిచాడు. అయితే, నాలుగో రోజు ప్రారంభ సెషన్‌లో 66 పరుగుల వద్ద అతను వెనుదిరిగాడు. ఆట మధ్యలో దక్షిణాఫ్రికా కాస్త తడబడినా.. చివరికి లక్ష్యాన్ని చేరుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
లార్డ్స్‌లో మరో రికార్డు
దక్షిణాఫ్రికా జట్టు లార్డ్స్ మైదానంలో మరో రికార్డు నమోదు చేసింది. 200పైగా లక్ష్యాన్ని ఐదోసారి చేధించింది. ఇదివరకు 2008లో పెర్త్‌లో 414 పరుగుల భారీ లక్ష్యాన్ని, 2002లో డర్బన్‌లో 335 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన దక్షిణాఫ్రికా, ఇప్పుడు మరోసారి ఆసీస్‌పై విజయం సాధించి, తమ ఛేజింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఇది లార్డ్స్‌లో రెండో అత్యధిక స్కోర్ ఛేజింగ్ విజయం.