తెలంగాణలో సాగు నీటి సమస్యలు, కృష్ణా నది జల వివాదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా భవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హాజరైన అనంతరం సీఎం రేవంత్ సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. “తెలంగాణ ప్రజల హక్కుల కోసం దేవుడితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడుతాను. ఎవరి కోసమూ ప్రజల హక్కులను తాకట్టు పెట్టే పరిస్థితి లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
జూరాల వద్దే తీసుకుని ఉంటే…
రేవంత్ వ్యాఖ్యల ప్రకారం, జూరాల వద్ద కృష్ణా జలాలను తీసుకుని ఉంటే, నేడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలపై ఈ స్థాయిలో దోపిడీకి అవకాశం ఉండేది కాదు అని అన్నారు.
హైదరాబాద్‌కు తాగునీరు అందిన తరువాతే మిగిలిన జలాలపై చర్చించాల్సిన అవసరం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మండిపాటు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో రెండు టీఎంసీలను తరలించాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఒక్క టీఎంసీకి తగ్గించారని, అంచనాలు పెంచి నీటి వనరులను తగ్గించారని రేవంత్ విమర్శించారు.
“బేసిన్లు, భేషజాలు లేవని చెప్పే కేసీఆర్, గోదావరి నదిపై ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టును 2007-08లోనే ప్రారంభించారు” అని గుర్తు చేశారు.
కాళేశ్వరం పేరిట భారీ కుంభకోణం!
రెవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలో సాగు ప్రాజెక్టుల ఖర్చులను కూడా ప్రజల ముందు ఉంచారు.
“కాంగ్రెస్ హయాంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం, ఒక్కో ఎకరాకు ఖర్చు ₹93,000 మాత్రమే. కానీ కేసీఆర్ హయాంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి, ఒక్కో ఎకరాకు ₹11 లక్షలు ఖర్చు పెట్టారు. ఇదేంటో ప్రజలు విచారించాలి” అని మండిపడ్డారు.

చర్చకు మేము సిద్ధం..
“కేసీఆర్ ఎప్పుడైనా శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించాలంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజల ముందు బహిరంగ చర్చకు మేము వెనుకాడము” అని స్పష్టం చేశారు.
మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్ చర్చకు పిలిచినా రాలేదంటూ ఆయనపై చేస్తున్న విమర్శలకు గట్టి జవాబిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచర్ల, గోదావరి జలాల దోపిడీపై చర్చించేందుకు కేటీఆర్ సీఎంను చర్చకు ఆహ్వానించి.. ప్రెస్‌క్లబ్‌లో ఎదురుచూసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన రేవంత్.. పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరించారు. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి వచ్చినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. క్లబ్‌లు, పబ్‌ల్లో కాదని మరోమారు స్పష్టం చేశారు.