ఎవ‌రీ న‌క్స‌లైట్‌ నంబాల కేశ‌వ‌రావు..?

Share this article

తుపాకులు ప‌ట్టి పోరాటం చేసే మావోయిస్టులు ఉన్న‌ట్టుండి పంథా మార్చేశారు. అధునాత‌న ఆయుధాలతో దాడులు.. టార్గెట్ చేస్తే గురి త‌ప్ప‌ని బాంబు దాడులు మొద‌లుపెట్టారు. ప్ర‌తీ దాడిలో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూ.. వాళ్ల‌ పేరెత్తితేనే భ‌యం పుట్టేలా చేశారు. అప్ప‌టి దాకా ఉద్య‌మమంటూ సాగిన దాడులు.. తీవ్ర‌రూపం దాల్చాయి.. బీభ‌త్సాన్ని సృష్టించాయి. రెండు ద‌శాబ్ధాల క్రితం చోటుచేసుకున్న ఈ మార్పు వెన‌క ఉన్న ఒకే ఒక మాస్ట‌ర్ మైండ్, ప్ర‌స్తుత సీపీఐ(మావోయిస్టు) పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంబాల కేశ‌వ‌రావు (Nambala Keshava rao) అలియాస్ బ‌స‌వ‌రాజు(Basavaraju). త‌ల‌పై ఏకంగా రూ.కోటిన్న‌ర న‌జ‌రానా ఉన్న ఈ మావోయిస్టు కీల‌క నేత బుధ‌వారం పోలీసు ఎన్‌కౌంట‌ర్‌(Encounter)లో మృతి హ‌త‌మ‌య్యారు. ఈ కాల్పుల్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మరణించారు. గత రెండు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బసవరాజు మరణంతో మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర దెబ్బ తగిలినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎవ‌రీ బసవరాజు?
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన జయన్నపేట గ్రామానికి చెందినవారు. బ‌స‌వ‌రాజుగానే కాదు.. గ‌గ‌న్న‌, ప్ర‌కాశ్‌, విజ‌య్‌, న‌ర‌సింహ ఇలా అనేక పేర్ల‌తో దేశంలోని ద‌ళాల‌కు ప‌రిచ‌యం. ఎప్పుడు పుట్టారో తెలియ‌కున్నా.. 68 ఏళ్ల వ‌య‌సు ఉంటుంద‌ని అంచ‌నా.

వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ప్రస్తుతం NIT)లో చదివిన బసవరాజు విద్యార్థి దశలోనే మావోయిజం వైపు ఆకర్షితులై, 1970లలో నక్సలైట్ ఉద్యమంలో చేరారు. పీపుల్స్ వార్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషించిన ఆయన, 2004లో సీపీఐ(మావోయిస్టు) ఏర్పాటైన తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా పనిచేశారు.

మిలిట‌రీ క‌మిష‌న్ ఆయ‌న కోస‌మే!
సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి మూడు ప్రధాన శాఖలు ఉన్నాయి – సెంట్రల్ కమిటీ (CC), పాలిట్ బ్యూరో (PB), మరియు సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC). 2004లో మిలిట‌రీ కమిషన్ ఏర్పాటైంది. ఈ క‌మిష‌న్ ఏర్పాటైన నాటి నుంచే బ‌స‌వ‌రాజే లీడ‌ర్‌. గెరిల్లా యుద్ధంలో ఆయ‌న‌కున్న నైపుణ్య‌మే ఎన్నో ఘోర‌మైన దాడుల‌ను ప‌క్కాగా అమ‌లు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డింది.

బసవరాజు మిలిటరీ వ్యూహకర్తగా పేరుగాంచారు. ఆయన పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడు కావడంతో పాటు అంత‌ర్జాతీయంగా ఆయుధ వ్యాపారుల‌తో ఉన్న సంబంధాలతో కీల‌క నేత‌గా ఎదిగారు. జిలటిన్ స్టిక్స్, ఇత‌ర పేలుడు ప‌దార్థాలు ఉపయోగించి చేసిన అనేక భారీ పేలుళ్ల‌లో బ‌స‌వ‌రాజు ప్ర‌మేయం ఉండేద‌ని ప్ర‌చారం.

బ‌స‌వ‌రాజు కీల‌క దాడులు:

2010 దంతెవాడ దాడి: భ‌ద్ర‌తా ద‌ళాల బ‌స్సుపై చేసిన ఈ బాంబు దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు హతమయ్యారు.

2013 జీరం ఘాట్ దాడి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతలపై దాడిలో 27 మంది మరణించారు.

2003 అలిపిరి బాంబు దాడి: అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై తిరుపతిలో జరిగిన దాడి. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడికి బసవరాజే మాస్టర్ మైండ్‌గా భావిస్తున్నారు.

2019 కిడారి స‌ర్వేశ్వరరావు, శివేరి సోమల హత్య: విశాఖపట్నం జిల్లాలోని లిపిట్టుపుట్టు వద్ద జరిగిన ఘాతుక ఘటనలో ఇద్ద‌రు తెదేపా నేత‌లు మృతి చెందారు.

2024 మే 17న గ‌డ్చిరోలి దాడి: మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలిలో జ‌రిగిన ఈ దాడిలో 15 మంది సి-60 క‌మాండోలు మృతి చెందారు. సుమారు 30 కిలోల విస్పోట‌కాలు వాడి చేసిన ఈ భారీ పేలుళ్ల‌కు సూత్ర‌దారి బ‌స‌వ‌రాజేన‌ని పోలీసులు అనుమానం. జిల‌టిన్ స్టిక్స్‌ను క‌ర్ర‌పుల్ల‌లతో క‌ప్పేసి పోలీసుల‌ను బ‌లి తీసుకున్నాడీ ఘ‌ట‌న‌లో.

వ్యూహాల‌న్నీ మార్చేసి..!
మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి.. స్వ‌చ్ఛంధంగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. ఆ బాధ్య‌త‌లు అందుకున్న బ‌స‌వ‌రాజు పార్టీ వ్యూహాన్ని పూర్తిగా మార్చేశార‌ని చెబుతుంటారు. పార్టీ వ్యూహాల్ని పోరాటాత్మ‌క దిశ‌గా మ‌ల‌చ‌డంతో పాటు.. భ‌యాన‌క విధ్వంసం సృష్టించేందుకు, క‌నిపించిన పోలీసుల‌పై కాల్పులు జ‌రిపేలా ప‌థ‌క‌ర‌చ‌న‌లు చేశారు. ద‌ళాల‌నూ అదే విధంగా మార్చారు. పెద్ద ఎత్తున ఆయుధ స్మ‌గ్ల‌ర్లు, అంత‌ర్జాతీయ డీల‌ర్ల‌తోనూ సంబంధాలు నెర‌పిన బ‌స‌వ‌రాజు.. ఏళ్ల త‌ర‌బ‌డి వేర్వేరు వేషాల్లో బ‌య‌ట తిరుగుతూనే ఉన్నార‌ని స‌మాచారం.

గ‌త కొంత‌కాలంగా మావోయిస్టుల‌ను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప్ర‌త్యేక ఆప‌రేష‌న్లు చేప‌డుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌ధాన నేత‌ల ఎన్‌కౌంట‌ర్‌, కీల‌క స‌భ్యుల లొంగుబాటు పార్టీకి మైన‌స్‌గా ఉన్నా.. బ‌స‌వ‌రాజు లాంటి వాళ్లు ఇన్నాళ్లూ పార్టీని నిలబెడుతూ వ‌చ్చారు. యువ‌త‌ను ఆవైపు తిప్పుకుని అడ‌వుల బాట ప‌ట్టించేందుకు ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌లు రూపొందించుకున్నారు. అయితే, మిలిటెంట్ ఆప‌రేష‌న్లలో పార్టీకి వెన్నుముక‌గా ఉన్న బ‌స‌వ‌రాజు మ‌ర‌ణంతో ఇక పార్టీ ప‌త‌నం మొద‌లైన‌ట్లే విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *