Wanaparthy : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పాల్గొని నివాళులు అర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు పాటుపడిన గొప్పవ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. స్వరాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఏవో భాను ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.