
Hyderabad: తెలుగు సినీ ప్రియులపై సార్, లక్కీ భాస్కర్ సినిమాలు వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. ఓ సాధారణ కథను అసాధారణ రీతిలో చూపించి ప్రతీ ఒక్కరినీ కట్టి పడేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి. సైలెంట్‌గా హిట్లు కొడుతూ వెళ్లిపోతున్న ఈ తెలుగు యువ డైరెక్టర్ ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ సూర్యతో జట్టు కట్టనున్నారు. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్లతోనే కుర్రకారును కట్టిపడేసే మమితా బైజూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి.

హీరో హీరోయిన్లు సూర్య, మమితా బైజులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా, నిర్మాత ఎస్.రాధాకృష్ణ బౌండ్ స్క్రిప్ట్‌ని దర్శకుడు వెంకీ అట్లూరికి అందించారు. సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో తన కథా బలాన్ని చూపించారు వెంకీ. ఇప్పుడు సరైన నటుడికి సరైన కథ దొరికితే బాక్సాఫీస్ బద్దలవక తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంతోషం అదనపు బలం కానుండగా.. సీనియర్ హీరోయిన్లు రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుండగా.. వచ్చే వేసవికి సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.