UPI: దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఇకపై డిజిటల్ చెల్లింపులు స్వీకరించనున్నారు. భారత ప్రభుత్వ తపాలా శాఖ (India Post) డిజిటలైజేషన్ దిశగా మరింత ముందడుగు వేసింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది పోస్టాఫీస్‌లు ఇక డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం తపాలా శాఖలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థ అనుసంధానం పూర్తిగా లేదు. ఈ కారణంగా యుపీఐ పేమెంట్లు చేసేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే, తాజా నిర్ణయం ప్రకారం తపాలా శాఖ ఆధునీకరణలో భాగంగా డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలను అమలు చేయనుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే, కస్టమర్లు ఇక తమ మొబైల్ ఫోన్ నుంచి సులభంగా యూపీఐ చెల్లింపులు చేయగలుగుతారు.
ఆగస్టు 1 నుంచి అమల్లోకి..
ఈ కొత్త డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఆగస్టు 1వ తేదీ నాటికి దేశంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి రానుంది. తపాలా శాఖ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన ఐటీ 2.0 (India Post IT Modernization 2.0) పథకం కింద ఇది అమలు అవుతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కర్ణాటక సర్కిల్‌లో ఈ సదుపాయం ప్రారంభించారని, ప్రతిస్పందన చాలా చక్కగా ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు తపాలా కార్యాలయాల్లో మనువంటి సేవలు పొందాలంటే నగదు లేదా పాత విధానాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టపాలా సేవలు, స్పీడ్ పోస్టు, మనీ ఆర్డర్‌లు, లాజిస్టిక్ సేవలు, ఇతర బ్యాంకింగ్ సేవలన్నింటికీ డిజిటల్ చెల్లింపు మార్గం అందుబాటులోకి రానుంది. ఇక మొబైల్ యాప్‌లు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌లతోనే సులభంగా చెల్లింపులు చేయొచ్చు.
గ్రామీణ ప్రాంతాలకూ డిజిటల్..
ప్రభుత్వ డిజిటల్ ఇండియా (Digital India) అభియాన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకూ డిజిటల్ సేవలను విస్తరించే లక్ష్యంతో తపాలా శాఖ ఈ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.55 లక్షలకుపైగా పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండటంతో, ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెరుగుతుంది. ఇక నగదు చెల్లింపులు తగ్గిపోతాయి, లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది.
ఈ డిజిటల్ చెల్లింపు సదుపాయంతో పోస్టాఫీస్‌లు కూడా మోడర్న్ కౌంటర్లుగా మారుతున్నాయి. ఇకపై తపాలా సేవలు పొందాలంటే నగదు తప్పనిసరి కాదు. చెల్లింపులు త్వరగా, సురక్షితంగా పూర్తవుతాయి.