ఇద్దరు అధికారుల అరెస్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపా సర్కారులో చక్రం తిప్పిన ఇద్దరు కీలక అధికారులను సిట్ అరెస్టు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి జగన్ కార్యదర్శిగా చేసిన ధనుంజయ రెడ్డి, సీఎం మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును సిట్ నిర్ధారించింది. రేపు మేజిస్ట్రేట్ ముందు ఇరువురినీ హాజరు పరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.

జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ చక్రం తిప్పారు. పలు అక్రమ కేసుల్లో, ప్రభుత్వం చేసిన కీలక పనుల్లో అన్నీ వెనకుండి నడిపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో పలువురు కీలక నిందితులను విచారిస్తోన్న సిట్.. మద్యం ముడుపులు చివరికి 31, 32 నంబరు నిందితులైన ఈ ఇద్దరికీ చేరాయన్న కీలక సమాచారంతో కొద్దిరోజులుగా విచారిస్తోంది. అయితే, వీరి నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రయోజనం పొందారనే అభియోగాలున్నాయి. ఈ ఇద్దరి అరెస్టుతో జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. త్వరలోనే మరికొంతమంది కీలక నేతల అరెస్టులు ఉండే అవకాశముందని సమాచారం.
2006 బ్యాచ్‌కు చెందిన ధనంజయ రెడ్డి.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయనను అండమాన్ నుంచి ఏపీకి తీసుకొచ్చి ఐఏఎస్ హోదా కట్టబెట్టింది. కీలక శాఖలు కట్టబెట్టింది. జగన్ అధికారంలోకి రాగానే అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఆది నుంచి పలు అక్రమ కేసుల్లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది.