
Tirupathi: కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది హిందూ పర్యాటకులు మృతి చెందిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక్కో పర్యాటకున్ని నువ్వు ముస్లింవా, హిందువువా అని ప్రశ్నిస్తూ.. నిర్ధారణ కోసం ఇస్లాం కల్మా చదవాలంటూ ఒక్కొక్కరినీ విచక్షణా రహితంగా కాల్చేశారని తెలిసి హిందూ సమాజం ఉలిక్కిపడింది. పలువురు కేంద్ర మంత్రులు, కీలక నాయకులు సైతం ఉగ్రవాదానికి మతం లేదని చెప్పొద్దంటూ మండిపడ్డారు. అటు పక్కనున్న బంగ్లాదేశ్‌లోనూ ఇటీవలె హిందువులపై దాడులు జరగడం.. ఇప్పుడు కశ్మీర్ ఉగ్రదాడి ఒకే మతాన్ని టార్గెట్ చేస్తూ ఉండటంతో ఇప్పడు మేల్కోకపోతే.. హిందువులకు మిగిలి ఉన్న ఈ ఒక్క దేశమూ మిగలదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, హిందువుల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందంటూ ఓ ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది. 1981 సెప్టెంబరు 30వ తేదీన ప్రచురితమైన ఆంధ్రప్రభ వారపత్రికగా కనిపిస్తున్న ఆ పోస్టును ఇప్పుడు హిందూ సంఘాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి. మీరు హిందువులు.. అందుకు గర్వించండి! అతిశ్రేష్ఠపరంపరకు వారసులు.. మరవద్దు అంటూ సాగిన ఆ ప్రకటనలో.. నిజమైన హిందువులయ్యేందుకు పాటించాల్సిన నియమాలను రాసుకొచ్చారు.
ఆ నియమాలివే..
- మీ సంప్రదాయానుగుణమైన బొట్టు ధరించడం అలవాటు చేసుకోండి
- ప్రతిరోజూ స్నానానంతరం ఒక్కసారైనా మీకిష్టమైన దేవుని నామజపం చేయండి. (ఓం నమో వేంకటేశాయ, ఓం నమః శివాయ, హరేరామ హరే రామ, హరే కృష్ణ, హరే కృష్ణ…)
- ప్రతిరోజూ వేంకటేశ్వర సుప్రభాతంలో కనీసం పది శ్లోకాలు పఠించండి
- మీ ఇంటి ముందు ఓంకారమును అతికించండి
- భగవద్గీత నుంచి రోజూ ఒక శ్లోకం పఠించండి
- వారానికోసారి అయినా కుటుంబంతో కలిసి దగ్గర్లోని ఆలయం సందర్శించండి
- హిందువుల సామాజిక ఉత్సవాల్లో పాల్గొని చేతనైన సాయం కచ్చితంగా చేయండి
తి.తి. దేవస్థానములు , తిరుపతి పేరిట ఈ ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది.