TTD: వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత వినే ఉంటాం.. ఇప్పుడు టీవీ యాంకర్ శివజ్యోతి పరిస్థితి అలాగే మారింది. ఇటీవల తిరుమల దర్శనం తర్వాత ఆమె ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆమె వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శివ జ్యోతికి సంబంధించిన ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసినట్లుగా సమాచారం. దీనివల్ల భవిష్యత్తులో ఆమె శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లైంది.
కొన్ని రోజుల క్రితం శివ జ్యోతి తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం క్యూ లైన్‌లో అందించే ప్రసాదం తీసుకుంటూ, “ఇంత ఖరీదైన ప్రసాదం అడుగుతున్నాం… మనమే కాస్ట్లీ బిక్షగాళ్లు” అంటూ వ్యాఖ్యానించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక మంది భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ పవిత్రత, శ్రీవారి ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యాన్ని అవమానించినట్టుగా భావించిన భక్తులు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.

క్షమాపణ చెప్పినా..
వివాదం పెద్దదిగా మారడంతో శివ జ్యోతి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు తెలిపింది. తన ఉద్దేశ్యం వ్యంగ్యంగా మాట్లాడడమే తప్ప ప్రసాదాన్ని అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఎవరి భావోద్వేగాలను దెబ్బతీసినా హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నానని చెప్పింది. తాను ఏడు వారాల వేంకటేశ్వర వ్రతం చేస్తేనే తను ఇన్నేళ్ల తర్వాత సంతానం పొందుతున్నానని.. ఎప్పుడూ వెంకన్నను తప్పుగా చూల్లేదంటూ నచ్చజెప్పుకొచ్చింది.
అయితే ఈ వివరణతో భక్తుల అసంతృప్తి తగ్గకపోవడంతో టీటీడీ ఆమె ఆధార్ కార్డును సిస్టమ్‌లో బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆమెకు సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, అర్జిత సేవలు, ఈ-దర్శనం వంటి అనుమతులు నిలిపివేయబడ్డాయి. ఆలయ పరువు, సంప్రదాయాలు మరియు భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే వ్యాఖ్యలను టీటీడీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. భక్తులు టీటీడీ చర్యను సమర్థిస్తూ స్పందిస్తుండగా, కొందరు ఇది కొంచెం కఠిన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. అయితే దేవాలయంపై వ్యాఖ్యలు చేసే విషయంలో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
