
America: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారతదేశంపై మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎక్కువ పన్నులు విధిస్తోందని.. అక్కడ తయారీ ఆపేయాలని అమెరికా సంస్థలకు చెప్తున్నానన్నారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్(Apple CEO Tim Cook) తో భారత్‌కు వెళ్లొద్దని చెప్పానన్నారు. టిమ్ కుక్ సారథ్యంలోని ఆపిల్ సంస్థకు అమెరికా అన్ని వసతులు కల్పిస్తున్నా.. టిమ్ మాత్రం భారత్‌లో ఆపిల్ తయారీ కేంద్రాలను విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు. అతన్ని వెళ్లొద్దని నేనే వారించానంటూ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు ట్రంప్. ప్రపంచంలోనే భారత్ అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తోందన్నారు. యూఎస్-భారత్ మధ్య జరిగే వాణిజ్య ఒప్పందంలో జీరో టారిఫ్‌కి భారత్ ఒప్పుంకుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అయితే, భారత అభివృద్ధి, తయారీ రంగం, ప్రపంచ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపేలా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోగా.. వాణిజ్య ఒప్పందం గురించి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. అమెరికా విధిస్తోన్న ఆంక్షలు, దిగుమతి సుంకాల లెక్కలపై స్పష్టత లేదని వివరించారు. అందుకే ఈ ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని.. ఇంకా తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని మీడియాకు చెప్పుకొచ్చారు.
ఆపిల్ సంస్థ దాదాపు రూ.18లక్షల కోట్ల పెట్టుబడులు భారత్‌లో పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఫాక్స్‌కాన్ లాంటి సంస్థలు విడి పరికరాలను భారత్ కేంద్రంగానే అసెంబుల్ చేస్తుండగా.. చైనా నుంచి పూర్తి మార్కెట్‌ను తరలించేందుకు ఆసియా(Asia)లో భారత్‌ను మరో కేంద్రంగా ఆపిల్ ఎంచుకుంది. ఇందులో భాగంగానే తమిళనాడులో రెండు, కర్ణాటకలో ఓ అసెంబ్లింగ్, తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తోంది. ఈ సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈనెల 17 నుంచి 20 తేదీల మధ్య భారత విదేశాంగ శాఖ మంత్రి యూఎస్ లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ సమయంలో జరిగే సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేధిక వెల్లడించింది.