Viral: మహారాష్ట్రలో మంత్రి సంజయ్ షిర్సాత్ మరోసారి ఓ వివాదాస్పద వీడియోతో వార్తల్లోకెక్కారు. హోటల్ గదిలో ఆయన బెడ్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతుండగా, పక్కనే బ్యాగులో నోట్ల కట్టలు కనపడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గానికి చెందిన నేత సంజయ్ రౌత్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడంతో మరింత కలకలం రేగింది.
వీడియోను షేర్ చేసిన రౌత్… “మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పరిస్థితిని చూసి జాలిగా ఉంది. ఈ వీడియో నిస్సహాయతకు నిదర్శనం,” అంటూ తీవ్రంగా విమర్శించారు.
తెరపైకి మళ్లీ పాత కేసు
2019 నుంచి 2024 మధ్య శిర్సాత్ అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలతో ఆయనకు ఆదాయపన్ను శాఖ (Income Tax Department) నుంచి ఇప్పటికే నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోట్ల కట్టల వీడియో బయటపడటంతో విషయం మరింత హాట్ టాపిక్ అయింది.
మంత్రి శిర్సాత్ స్పందన
ఈ ఘటనపై మంత్రి సంజయ్ షిర్సాత్ స్పందిస్తూ… వీడియోలో ఉన్న బ్యాగులో డబ్బు కాదని, కేవలం తన బట్టలే ఉన్నాయని వివరణ ఇచ్చారు. “నాకొచ్చిన నోటీసులు నిజమే. కొంతమంది నా మీద ఆదాయపన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. అందుకే నాకూ నోటీసులు వచ్చాయి. కానీ నేను ఎలాంటి అవినీతి చేయలేదు. పూర్తిగా సహకరిస్తాను. వివరణ ఇచ్చేందుకు కొద్దిగా గడువు కోరుతున్నాను,” అని మంత్రి పేర్కొన్నారు.
ఔరంగాబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సంజయ్ షిర్సాత్ వివరణ ఇచ్చినప్పటికీ.. వీడియోలో స్పష్టంగా కనపడుతున్న నోట్ల కట్టలపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఇది నిజంగా డబ్బేనా? లేక వీడియో ఫేక్ అయి ఉండొచ్చా? అన్నది ప్రస్తుతం అధికారుల పరిశీలనలో ఉంది. అధికార సంస్థలు ఈ వీడియోను ఫోరెన్సిక్‌కి పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.