Trending: చైనా దేశంలో ఓ వృద్ధుడు తన పెంపుడు పిల్లి కోసం ఏకంగా తన మొత్తం ఆస్తిని రాసిపెట్టాలనుకుంటున్నాడు. ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది. వారసులు లేని ఓ వృద్ధుడు, ఇన్నేళ్లూ తన ఒంటరితనాన్ని తీర్చిన ఓ పిల్లిని మనసుపూర్వకంగా చూసుకునే వారికి తన ఆస్తి కానుకగా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన లాంగ్ అనే వ్యక్తి ఈ అరుదైన నిర్ణయం తీసుకున్నారు.
భార్య మరణం తర్వాత ఒంటరి జీవితం
లాంగ్ భార్య పదేళ్ల క్రితం మరణించగా, ఆయనకు పిల్లలు కూడా లేరు. ఒంటరితనంతో బాధపడుతున్న అతడి జీవితంలో కొన్ని పిల్లులు వచ్చి చేరాయి. వాటిలో ఎక్కువ పిల్లులు అనారోగ్యంతో చనిపోయాయి. క్షియాన్బా అనే పిల్లి మాత్రం జీవించి ఉండడంతో, లాంగ్‌కి దానిపై ప్రత్యేకమైన మమకారం పెరిగింది. తను కంటికి రెప్పలా దానిని కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే, ఇప్పుడు వయసు పైబడటంతో తాను చనిపోయిన తర్వాత ఆ పిల్లిని ఎవరు చూసుకుంటారు? అన్న ఆలోచన అతడిని కలవరపెడుతోంది. అందుకే గాంగ్‌డాంగ్‌లోని రేడియో, టీవీ చానళ్లలో ప్రకటన ఇచ్చాడు. “నా పిల్లిని ప్రేమగా చూసుకునే వారికి నా అపార్ట్‌మెంట్, బ్యాంకు డిపాజిట్లు కానుకగా రాసిస్తాను. అది చనిపోయే వరకు శ్రద్ధగా చూసుకోవాలి” అని ప్రకటించాడు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ వృద్ధుడి చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పెంపుడు జంతువు కోసం ఇలా తన జీవితాస్థిని దారపోయడంపై నెటిజన్లు మెచ్చుకొంటున్నారు. కొందరు దీనిని మానవీయ ప్రేమకు నిదర్శనంగా చూస్తున్నారు. మరికొందరు వృద్ధుల ఒంటరితనంపై చర్చ పెడుతున్నారు.

