
Hyderabad: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ కానున్నాయి. అద్దె ప్రాతిపదికన సినిమాలు నడిపేందుకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎగ్జిబిటర్ల సంఘం ఈమేరకు ప్రకటన చేసింది. సినిమాలను పర్సంటేజిల రూపంలో చెల్లిస్తే మాత్రమే థియేటర్లు నడుస్తాయని స్పష్టం చేసింది. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిన్న జరిగిన సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబుతోపాటు దాదాపు అరవై మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. చాలా రోజులుగా పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య చర్చ నడుస్తోంది. రెంటల్ పద్దతిలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు వాదిస్తుండగా.. పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఇది నిర్మాతలకు తలనొప్పిగా మారింది. దీనిపై ఇరు సంఘాల మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో జూన్ 1 నుంచి ఈ నిర్ణయం తీసుకుంటామని ఎగ్జిబిటర్లు ప్రకటించారు.