ఆర్టీసీ ఉద్యోగుల‌కు సంస్థ బ‌హిరంగ‌ లేఖ‌!

Share this article

Telangana: తెలంగాణా ఆర్టీసీలో(TGSRTC) పెండింగ్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ జేఏసీ(JAC) నాయ‌కులు స‌మ్మెకు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో యాజ‌మాన్యం ఉద్యోగులంద‌రికీ ఓ బ‌హిరంగ లేఖ రాసింది. గ‌తంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సంస్థ ఏమేం చేసింది.. ఏం చేయ‌బోతోంద‌ని వివ‌రిస్తూ సాగిన లేఖ‌లో.. స‌మ్మె వ‌ల్ల జ‌రిగే న‌ష్టాల్ని వివ‌రించింది. ఎవ‌రూ తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సంస్థ‌ను దెబ్బ‌తీయొద్ద‌ని కోరింది..

ఆర్టీసీ కుటుంబ స‌భ్యులంద‌రికీ న‌మ‌స్కారం!! : క్షేత్ర‌స్థాయిలో మీరంతా నిబద్దత, అంకితభావం, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సమర్థవంతంగా విధులు నిర్వ‌ర్తించ‌డం వ‌ల్లే టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది. మీరు స‌మిష్టి కృషితో ప‌నిచేస్తూ బ‌స్సుల్లో ప్ర‌తి రోజు 60 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికుల‌ను క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ‌ను అన్ని తామై ముందుకు నడిపిస్తోన్న ఉద్యోగుల సంక్షేమం విష‌యంలో యాజ‌మాన్యం ఏమాత్రం రాజీప‌డ‌టం లేదు. సంస్థ‌కు వ‌చ్చే ప్ర‌తి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చించ‌డం జ‌రుగుతోంది.

మీ అంద‌రికీ తెలుసు.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కూడా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్ మెంట్ తో 2024 మే నెలలో యాజ‌మాన్యం అందించింది. పెండింగ్‌లో ఉన్న 10 డీఏలను 2019 నుంచి దశలవారీగా విడుదల చేసింది. ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను చెల్లించింది. గత మూడున్నరేళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదినే వేతనాలను ఇస్తోంది. పీఎఫ్‌, సీసీఎస్ రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమతప్పకుండా చెల్లిస్తూ బ‌కాయిల‌ను క్ర‌మేణా యాజమాన్యం త‌గ్గిస్తోంది. టీజీఎస్ఆర్టీసీ ఆర్థిక ప‌రిస్థితి మీకు తెలియంది కాదు. ఆర్థిక క‌ష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికే మొద‌టి ప్రాధాన్య‌త‌ను సంస్థ ఇస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ది ప‌థంలో ప‌య‌నిస్తోన్న సంస్థ‌కు, ఉద్యోగుల‌కు స‌మ్మె అనేది తీర‌ని న‌ష్టం క‌లిగిస్తుంది. ఆర్టీసీ బాగుంటేనే మ‌న‌మంతా సంతోషంగా ఉంటాం. స‌మ్మె అనేది స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. 2019లో జ‌రిగిన స‌మ్మె వ‌ల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయ‌బ‌డింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సమ్మె వల్ల ఆర్టీసీ 39 మంది ఉద్యోగులను కొల్పోయింది.

సమ్మె తర్వాత వ‌చ్చిన క‌రోనా వ‌ల్ల ఆర్టీసీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మీ స‌మిష్టి కృషి వ‌ల్ల అన్ని సంక్షోభాల‌ను ఎదుర్కొని.. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు చూరగొంటున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మ్మె అనేది శ్రేయ‌స్క‌రం కాదు. ఒక్క‌సారి ప్ర‌జ‌లు అసంతృప్తికి గురైతే కొంత‌కాలంగా సంస్థ బాగు, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌న్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇవ‌న్నీ సంస్థ మ‌నుగ‌డ‌కు ప్ర‌తికూల అంశాలుగా మారే ప్ర‌మాదం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఉద్యోగుల స‌మస్యల పరిష్కారానికి యాజ‌మాన్యం కట్టుబడి ఉంది. ఈ అంశం గురించి గౌర‌వ సీఎం రేవంత్ రెడ్డి గారు, ర‌వాణా మంత్రి శ్రీ పొన్నం ప్ర‌భాక‌ర్ గారు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త ఇచ్చారు. స‌మ్మె వల్ల సంస్థ ప్ర‌గ‌తితో పాటు ఉద్యోగుల‌కు న‌ష్టం వాటిల్లుతుంది. త‌ల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు స‌మ్మె ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని ఆర్టీసీ సిబ్బందికి యాజ‌మాన్యం విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాట‌ల‌కు ప్ర‌భావిత‌మై స‌మ్మెకు వెళ్తే సంస్థ‌తో పాటు ఉద్యోగుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌నే విష‌యం మ‌రిచిపోవ‌ద్ద‌ని సూచిస్తోంది.

ప్ర‌జ‌ల‌కు ర‌వాణాప‌ర‌మైన ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సేవ‌లందిస్తూ.. సంస్థ మేలు కోసం ఆలోచించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క ఉద్యోగిపై ఉంద‌ని పేర్కొంది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించిన, విధులకు ఆటంకం కలిగించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మూడున్నరేళ్లుగా సంస్థ బాగు కోసం యాజమాన్యం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. వాటిని విజయవంతం కూడా చేశారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోన్న సమయంలో సమ్మె పేరుతో చేజేతులా సంస్థ మనుగడకు, ఉద్యోగుల భవిష్యత్ కు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహారించవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఉద్యోగుల సంక్షేమం విష‌యంలో యాజ‌మాన్యం ఏమాత్రం రాజీప‌డ‌బోదని మరోసారి స్పష్టం చేస్తోంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *