TGSRTC హైదరాబాద్, 28.07.2025: పబ్లిక్ బస్సులు, బస్ స్టేషన్ల నిర్వహణ, నిబంధనలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్((BIS) రూపొందించిన భారతీయ ప్రమాణం IS 19225:2025పై టీజీఎస్ఆర్టీసీ అధికారులు, బీఐఎస్ హైదరాబాద్ శాఖలు సంయుక్తంగా ‘మానక్ మంథన్’ పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు. సోమవారం బస్ భవన్ వేధికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫీడర్ సర్వీసులు, టెర్మినల్స్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (ITS) వినియోగం, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్ విధానాల సమీకరణ, ఈ-బస్సుల నిర్వహణ, స్థిరమైన పట్టణ రవాణాను ప్రోత్సహించే అంశాలపై దృష్టి సారించారు. భారతీయ ప్రమాణాల అమలులో తలెత్తే సమస్యల, ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ఆర్టీసీ అధికారులు సలహాలు అందించారు.

ఈ-బస్సుల నిర్వహణకు ప్రత్యేక ప్రమాణాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రైవర్లు, సిబ్బందికి శిక్షణ, బస్ స్టేషన్ల నిర్వహణపై భారతీయ ప్రమాణాల్లో పొందుపరచాల్సిన విషయాలపై చర్చించారు. పటిష్టంగా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ముని శేఖర్, బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, మెంబర్ సెక్రటరీ శివం సోని, ఎస్పీఓ అభిసాయి, టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.