TG: పెళ్లికి ముందే అఫైర్‌.. భ‌ర్త‌ను చంపిన మ‌రో భార్య‌!

TG Wife murders husband

Share this article

TG: పెళ్లికి ముందు పెట్టుకున్న సంబంధం కోసం క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చిందో భార్య‌. దేశ‌వ్యాప్తంగా రాజా ర‌ఘువంశి కేసు సంచ‌ల‌నం రేపుతున్న వేళ‌.. తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో మ‌రో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని మరో రాష్ట్రంలో పడేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లీ కూతురు ఇద్దరూ బ్యాంకు ఉద్యోగితో సంబంధం పెట్టుకోవడం ఈ కేసులో కలకలం రేపుతోంది.

లేచిపోయి.. తిరిగొచ్చి పెళ్లి!
జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేట్ సర్వేయర్. కర్నూలుకు చెందిన ఐశ్వర్యను ఫిబ్రవరి 13న పెళ్లి చేసుకోవాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లికి ఐదు రోజులు మిగిలి ఉండగానే ఐశ్వర్య ఊహించని విధంగా కనిపించకుండా పోయింది. అప్పట్లోనే ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందన్న వార్తలు వినిపించాయి. అయితే, ఫిబ్రవరి 16న ఐశ్వర్య తిరిగి ఇంటికి వచ్చింది. తేజేశ్వర్‌ను ఫోన్‌లో సంప్రదించి, తాను ప్రేమ వ్యవహారంలో లేనని, కట్నం ఇబ్బందులతో ఒత్తిడికి లోనై స్నేహితురాలి ఇంటికి వెళ్లానని చెప్పింది. “నువ్వంటే నాకు చాలా ఇష్టం” అంటూ కలత చెంది మాట్లాడడంతో తేజేశ్వర్ మరోమారు ఆమెను నమ్మాడు. చివరకు తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టినా మే 18న పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి అయిన రెండో రోజే మనస్పర్థలు!
పెళ్లి అయినప్పటికీ ఐశ్వర్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రియుడితో రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం కొనసాగింది. పెళ్లి అయిన తరువాతే ఆమె ప్రియుడితో రెండు వేల సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల కాల్ డేటాలో స్పష్టమైంది. ఈ విషయంలో భర్తతో గొడవలు రోజూ జరిగేవి. పెళ్ల‌యిన రెండోరోజే తీవ్ర‌స్థాయిలో గొడ‌వ జరిగిన‌ట్లు స‌మాచారం.

త‌ల్లీ కూతురు.. ఇద్ద‌రూ ఒక‌రితోనే అఫైర్‌!
ఈ కేసులో అసలు షాక్ ఏమిటంటే… ఐశ్వర్య తల్లి సుజాత కూడా అదే బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తోంది. మొదట ఆమెకు బ్యాంకు ఉద్యోగితో అక్రమ సంబంధం ఉండగా, తర్వాత అతనే కూతురిని కూడా మాయ చేసి ప్రేమలో పడేశాడు. తేజేశ్వర్ ఉన్నంతవరకు తమ సంబంధం కొనసాగలేదని భావించిన తల్లీ కూతురు… ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించాలని ప్లాన్ చేశారు.

గొంతు కోసి చంపేసి..
జూన్ 17న తేజేశ్వర్‌ను కొందరు వ్యక్తులు “పొలం సర్వే చేయాలి” అంటూ అపాయింట్ బుక్ చేసుకుని కారులో తీసుకెళ్లారు. కారు లోపలే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి, గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఏపీలోని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేశారు. ఈ హత్యకు బ్యాంక్ ఉద్యోగి కొంతమందికి సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన డ్రైవర్‌ను కూడా వారితో పంపినట్టు విచారణలో వెల్లడైంది.

ప్రియుడు పరారీలో… భార్య, తల్లి అరెస్ట్
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. త్వరలో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *