TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి సరఫరా మరియు బిల్లుల వసూళ్లపై వాటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా అధిక ఆదాయాన్ని అందిస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మీటర్లు అల్ట్రాసోనిక్ జీఎస్ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. ట్యాంపరింగ్‌కి అవకాశం లేకుండా ఉండేలా రూపొందించిన ఈ స్మార్ట్ మీటర్లు, ఆటోమెటిక్‌గా బిల్లులు రూపొందించి హెడ్ ఆఫీస్ నుంచి నేరుగా పంపే విధంగా ఉంటాయి.
ఐటీ కారిడార్‌పై స్పెషల్ ఫోకస్..
వాటర్ బోర్డు సేకరించిన సమాచారం ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్‌లో నెలకు సుమారుగా రూ.100 కోట్లు బిల్లులు వసూలవుతున్నాయి. అయితే అందులో ఐటీ కారిడార్ (కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, నార్సింగి, మియాపూర్, శేరిలింగంపల్లి) నుంచి మాత్రమే రూ. 80 కోట్లు వసూలవుతున్నాయి. వసూళ్లలో సింహభాగం ఐటీ కారిడార్‌కే దక్కుతుంది. అందుకే ఈ ప్రాంతాల్లోనే మొదటగా స్మార్ట్ మీటర్ల అమలుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
కొత్త కనెక్షన్లకు భారీగా డిమాండ్
ఈ ప్రాంతాల్లో భారీగా మల్టీ స్టోరీ బిల్డింగ్స్, కమర్షియల్ ప్రాజెక్టులు పెరుగుతుండటంతో, కొత్త నీటి కనెక్షన్లకు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. వాటిలో మొత్తం దరఖాస్తుల్లో 70% పైగా వెస్ట్‌సిటీ (పశ్చిమ హైదరాబాద్) నుంచే రావడం గమనార్హం. ప్రస్తుతం 5 వేల కనెక్షన్లకు సంబంధించి మీటర్ ఛార్జీలు కూడా ముందుగానే వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు.
మొదటి విడతగా 6వేల స్మార్ట్ మీటర్లు
మొదటి దశలో 6,000 స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. వీటిని సరఫరా చేసే కంపెనీలు, మీటర్లు అమర్చడం నుంచి బిల్లింగ్, మెయింటెనెన్స్ వరకు అన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాన్యువల్‌గా బిల్లులు పంపుతున్న వాటర్ బోర్డు, స్మార్ట్ మీటర్ల అమలుతో డిజిటల్ డాష్‌బోర్డు ద్వారా రీడింగ్ తీసుకొని ఆటోమెటిక్ బిల్లులు జారీ చేయనుంది.

గతంలో AMR మీటర్ల వైఫల్యం
గతంలో అమలు చేసిన AMR (ఆటోమేటిక్ మీటర్ రీడింగ్) మీటర్లు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయాయి. కొంతమంది అధికారులు, మీటర్లు సరఫరా చేసిన సంస్థలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ట్యాంపరింగ్, సాంకేతిక లోపాలు, బిల్లింగ్ లో తేడాలు రావడంతో వాటిపై నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. దాంతో వాటర్ బోర్డు తిరిగి కొత్తగా స్మార్ట్ మీటర్ల దిశగా అడుగులు వేస్తోంది.
భవిష్యత్తు ప్రణాళిక
ముందుచూపుతో అధికారులు ఔటర్ రింగ్ రోడ్ అవతల ప్రాంతాల్లో భవిష్యత్తులో నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అమలు చేసే ఈ స్మార్ట్ మీటర్ల వ్యవస్థ, దీర్ఘకాలిక ప్రయోజనాలకే దోహదపడుతుందని భావిస్తున్నారు.