TG: ముందు MPTC, ZPTC.. తర్వాత స‌ర్పంచ్ ఎన్నిక‌లు!

TG Panchayat Elections

Share this article

TG: గ్రామాల్లో స‌ర్పంచ్‌, ఎంపీటీసీ, ఇత‌ర స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ముహూర్తం ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే మంత్రి సీత‌క్క వ‌చ్చేవారంలో నోటిఫికేష‌న్ విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే, జూన్ 20 నుంచి 25 తేదీల మ‌ధ్య‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ విష‌యాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్ర‌క‌టించారు. తొలుత గ్రామాల ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నిక‌లు నిర్వ‌హించి.. వారం గ్యాప్‌లో స‌ర్పంచ్‌, వార్డు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జూలై రెండో వారంలో స‌ర్పంచ్‌ ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. చివ‌రి వారంలో స‌ర్పంచ్ ఎన్నిక‌లు పూర్త‌య్యేలా ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీలకు ఎన్నికలు ఆగస్ట్‌లో నిర్వహించేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

జూన్ 20న నిర్ణ‌యం..
ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం జూన్ 20న సమావేశం కానుంది. ఇప్పటికే జూన్ 5న జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ ఎన్నికలపై ప్రాథమికంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులతో ఎన్నికల క్రమాన్ని అర్థవంతంగా నిర్వహించాల్సిన అంశంపై అభిప్రాయాలు కోరారు. మంత్రులలో అధికులు గ్రామ పంచాయతీ ఎన్నికలను మొదట నిర్వహించాలని సూచించారు. గ్రామాలలో నడుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎలక్షన్ నిర్వహణకు తగిన లాజిస్టికల్ సన్నాహకాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తదుపరి సమావేశం జూన్ 20న జరగనుంది. అదే సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు తుదిరూపు ఇచ్చే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాల అమలుకు వేగం
ఎన్నికల ముందు ప్రధాన సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వేగం పెంచింది. ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా నిధులు విడుదల చేయడం, ఇందిరమ్మ హౌజింగ్ నిధుల పంపిణీని జూన్ చివరి నాటికి ప్రారంభించడం, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకుంది.

TG Panchayat Elections

కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక పరీక్ష
ఈ స్థానిక సంస్థల ఎన్నికలు 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారాయి. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందస్తు హామీలు, ఆరు హామీల అమలు, పంట రుణ మాఫీ, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం అంశాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు ఈ గెలుపు అంత సులువుగా క‌నిపించ‌ట్లేదు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తామెన్నో ముఖ్య హామీలను అమలు చేశామని చెబుతోంది. దేశంలోనే అతిపెద్ద పంట రుణ మాఫీగా రూ.21,000 కోట్ల మాఫీ, రూ.500 గ్యాస్ సిలిండర్, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఏడాదికి రూ.12,000 పెరుగుదల వంటి పథకాల అమలును హైలైట్ చేస్తోంది. ఇందిరమ్మ హౌసింగ్ పథకాన్ని ప్రారంభించడం తమ అభివృద్ధి విధానానికి నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంటోంది. వీటిని చూపించే ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు ప్రణాళిక‌లు రూపొందిస్తోంది.

ఎన్నికల ఆలస్యం.. ప్రభావం
గ్రామ పంచాయతీల ఎన్నికలు ఫిబ్రవరి 2024 నుంచి, జిల్లా, మండల పరిషత్‌లు జూలై 2024 నుంచి, మున్సిపాలిటీలు జనవరి 2025 నుంచి లేకుండా పోయాయి. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల ద్వారా పరిపాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేయడంతో స్థానిక పరిపాలన ఆర్థికంగా కష్టాల్లో పడింది.

కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ
ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఓ ప్రజా అభిప్రాయ సేకరణగా భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తూ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అంద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా మంత్రులతో కలిసి గ్రామాల్లో పర్యటించి, బలమైన అభ్యర్థులను గుర్తించాల‌ని ఆదేశించింది. కీల‌క‌మైన‌ జెడ్పీటీసీ స్థానాలు బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌తో పాటు ఎప్ప‌టినుంచో పార్టీ కోసం ప‌నిచేస్తున్న వారికి సీట్లు ఇవ్వాల‌ని ఆదేశించింది. సామాజిక‌, ఆర్థిక కోణాలు త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిందేన‌ని స్ఫ‌ష్టం చేసింది.

ముందే ఎంపీటీసీ..!
తొలుత ముందు స‌ర్పంచ్‌.. త‌ర్వాత మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప‌లువురు మంత్రుల నుంచి స‌ల‌హాలు అందినా ప్ర‌భుత్వం వేరే నిర్ణ‌యం తీసుకుంది. మొద‌ట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌లే నిర్వ‌హించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ ఎన్నిక‌లు పార్టీ నేరుగా క‌నిపించే అవ‌కాశం ఉండ‌టంతో అధికార పార్టీకే ఎక్కువ సీట్లు గెలిచే అవ‌కాశ‌ముంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీల‌క నాయ‌కులు ఆయా స్థానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి గెలుపు తీరాల‌కు చేర్చే అవ‌కాశం ఉంటుంది. ఈ గెలుపును స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపించేలా చేయ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల బ‌లం, ప్ర‌భావం త‌ర్వాతి స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై స్ప‌ష్టంగా ఉంటుంద‌ని న‌మ్ముతున్నారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు పార్టీల‌తో సంబంధం లేక‌పోవ‌డంతో.. ముందే ఆ ఎన్నిక‌లు పెడితే ఒకే పార్టీ నేత‌ల మ‌ధ్య చీలిక‌లు.. విబేధాల‌తో పార్టీకి దెబ్బ త‌గులుతుంద‌ని.. అదే త‌ర్వాతి ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌భావం చూపిస్తుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *