TG హైదరాబాద్, జూలై 30: తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కొన్ని కీలక పదవుల భర్తీలో మాత్రం ఆలస్యం చూపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవుల కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం రెండు పేర్ల చొప్పున ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేడు (బుధవారం) కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఈ ముగ్గురు నేతల మధ్య నామినేటెడ్ పదవుల ఎంపిక, సామాజిక న్యాయం, సమతుల్యత అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరగనున్నాయి.
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, పార్టీలో నమ్మకమైన నేతలు, ఎన్నికల్లో శ్రమించిన కార్యకర్తలకు గౌరవంగా పదవులు కల్పించాలనే ఉద్దేశంతో పేర్లను పరిశీలించనున్నారు. అలాగే సామాజిక వర్గాల పరంగా కూడా సమతుల్యత పాటించేలా నియామకాలు జరిగేలా చూడనున్నారు.
మీనాక్షి చుట్టూ ప్రదక్షణలు..!
ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాల నుంచి నామినేటెడ్ పదవుల కోసం అధికారికంగా పేర్లను పంపినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు ఇప్పటికే తమ అనుచరులకే పదవులు దక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ను కలుస్తూ దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే ఈ సమావేశం ద్వారా నామినేటెడ్ పోస్టులపై మరింత స్పష్టత రానుంది.
పదవుల పంపకంపై నిర్ణయం తీసుకున్న తరువాత, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో అధికారిక గెజిట్ ద్వారా నామినేటెడ్ పోస్టులకు గవర్నర్ ఆమోదం తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ పోస్టుల ఎంపికతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరగనుంది. ఇదే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకుక కలిసొస్తుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.