TG: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇదే వరసలో మరో 9మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు పుకార్లు రేగుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు బీజేపీ అధిష్టానానికి టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.
దాదాపు పదేళ్ల పాలన తర్వాత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రతిపక్షానికి పరిమితమైంది బీఆర్ఎస్. మొదటి నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఇంటి పార్టీపై కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు పెద్ద దెబ్బే వేశాయి. రాజకీయంగా తిరిగి పుంజుకోలేదని, ఇక పనైపోయిందనే వాదనలూ పుట్టుకొచ్చాయంటే పార్టీ ఏమేరకు దెబ్బతిందో చెప్పనక్కర్లేదు.

దీనికి తోడు పుండు మీద కారంలా.. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కొద్దిరోజులుగా పార్టీపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సందిస్తోంది. ఇప్పటికే ఆమె పార్టీ నుంచి బయటకొచ్చేశారనే ప్రచారాలకు.. ఇటీవలె ఆమె పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ లిల్లీపుట్ నాయకుడంటూ, మరో నేత కార్తీక్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. దీనికి తోడు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అరెస్టు అవుతారనే ప్రచారం.. ఇంటిపోరుతో పార్టీ ముక్కలవుతుందేమోననే భయంలో కొందరు నాయకులు తమ భవిష్యత్తు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై లీగల్ యాక్షన్‌కు బీఆర్ఎస్ అడుగు వేయగా.. సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేసింది. దీనిపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల్లో ఎన్నికలు తప్పవని.. ఈ నాయకులనే అభ్యర్థులుగా నిలబెట్టి మళ్లీ గెలిచేందుకు కాంగ్రెస్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గువ్వల బాలరాజు గతంలోనూ బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉన్న సమయంలో బీజేపీలో చేరేందుకు రూ.100కోట్ల ఆఫర్ వచ్చినట్లు గతంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజుతో పాటు పైలట్ రోహిత్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, ముందస్తు సమాచారంతో అప్పటి సీఎం కేసీఆర్ ప్లాన్ ను తిప్పికొట్టిన విషయం తెలిసిందే.