TG: సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నటుడు విజయ్ దేవరకొండపై నమోదైన కేసుపై విచారణకు సైబరాబాద్ కమిషనర్ బదులు ఏసీపీ రావడం పట్ల అసహనం వ్యక్తం చేసిన కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన స్పీచ్‌లో ఎస్టీ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ పలువురు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు.
దీనిపై గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ సైబరాబాద్ కమిషనర్‌కు నోటీసులు పంపించారు. అయితే, ఈ విచారణకు ఆయనకు బదులు మాదాపూర్ ఏసీపీ హాజరయ్యారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ తీవ్రంగా స్పందించారు.
విచారణకు హాజరు కావాలని కమిషనర్ కు నోటీసులు ఇస్తే మీరెందుకు వచ్చారు, ఆ మాత్రం తెలియదా అంటూ మాదాపూర్ ఏసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో హైదరాబాద్ కమిషనర్ విచారణకు హాజరు అవ్వకపోతే, రాష్ట్ర డీజీపీని విచారణకు రప్పించాల్సి ఉంటుందని ఏసీపీని జాతీయ ఎస్టీ కమిషన్ హెచ్చరించింది. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇప్పటికే ఈ కేసుతో వివాదాలకెక్కిన నటుడు విజయ్ దేవరకొండకు గురువారం మరో కేసు మెడకు చుట్టుకుంది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లో భాగంగా కొంతకాలంగా తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతుండగా.. గురువారం 29మంది నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. అందులో విజయ్ దేవరకొండ ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే వరస ఫ్లాఫులతో సతమతవవుతున్న ఈ హీరో కెరీర్‌పై దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో రౌడీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో విజయ్ నటించిన ది కింగ్‌డమ్ భారీ అంచనాలతో విడుదలవబోతోంది.