TG: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి బదిలీ విషయంలో పెద్ద ఊరట లభించింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) ఆమెకు అనుకూలంగా తాజా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయించే మార్గం సాఫీ అయింది.
గతంలో ఏం జరిగింది?
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని కేంద్రం నాలుగు నెలల క్రితం విడుదల చేసిన డీవోపీటీ (DoPT) ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించారు. అయితే, ఆమ్రపాలి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తనని తెలంగాణలోనే కొనసాగించాలని ఆమె కోరారు.
ఆమ్రపాలి వాదనలు పరిశీలించిన క్యాట్, ఆమె అభ్యర్థనను సమర్థిస్తూ తెలంగాణ క్యాడర్‌కు మళ్లీ కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో ఆమె తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది.
ఆమ్రపాలి.. ఆల్వేస్ స్పెషల్!
ఆమ్రపాలి గతంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆమె తీసుకొచ్చిన కొత్త విధానాలు, ప్రజలతో కలిసిపొయే ధోరణి, పారదర్శకత ఆమెకు విశేష గుర్తింపు తీసుకొచ్చాయి. ఐఏఎస్ అధికారుల్లో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పాలనలో తనదైన ముద్ర వేశారు. గత ఉత్వర్వులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసుకు బదిలీ అయ్యాక అక్కడి టూరిజం శాఖలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు.
కీలక పోస్టేనా..?
ఇప్పటికే క్యాట్ ఉత్తర్వులు విడుదల కావడంతో, త్వరలోనే డీవోపీటీ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కీలకమైన హైదరాబాద్ మహానగర కమిషనర్‌గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆమ్రపాలి మరోసారి తెలంగాణకు రానుండటంతో ఏ శాఖ అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.