Tesla: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు టెస్లా మరోసారి వార్తల్లోకెక్కింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోబో టాక్సీ(Tesla Robot Taxi) సేవ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ పట్టణంలో ఈ సేవను ప్రారంభించేందుకు మస్క్ సన్నద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా రోబో టాక్సీల పై ఎలాన్ మస్క్ మాట్లాడుతూనే ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను కార్యరూపం దిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. మొదట దశలో టెస్లా కంపెనీ పది నుంచి ఇరవై వాహనాలను మాత్రమే రోబో టాక్సీ సేవలకు వినియోగించనుంది.
ఈ వాహనాలు టెస్లా మోడల్ Y కార్లుగా ఉండనున్నాయి. అయితే పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే ఈ టాక్సీలలో మానవ భద్రతా పరిశీలకులు తప్పనిసరిగా ఉండనున్నట్టు టెస్లా స్పష్టం చేసింది. అంటే డ్రైవర్ ఉండకపోయినా, మానవ పర్యవేక్షణ మాత్రం ఈ ప్రారంభ దశలో కొనసాగుతుందని తెలిపింది. ప్రస్తుతం టెక్సాస్ రాష్ట్రంలో రోబో టాక్సీలకు సంబంధించి కొన్ని నియంత్రణలు ఇంకా ఖరారు కాలేదు. కొన్ని చట్టపరమైన అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని టెక్సాస్ అధికారులు ఈ సేవను ప్రారంభించే ముందు తగిన నియంత్రణలు తీసుకురావాలని సూచించినప్పటికీ, టెస్లా మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా జూన్ 22న ప్రారంభిస్తామని స్పష్టంగా చెబుతోంది.

టెస్లా షేర్లపై ఏమేరకు ప్రభావం..?
ఈ మధ్య కాలంలో టెస్లా షేరు ధరల్లో భారీ ఊగిసలాట కనిపిస్తోంది. గత నెలలో టెస్లా షేరు ధర 35 శాతం వరకు పెరిగినా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 21 శాతం మేర తగ్గుదల కూడా నమోదు చేసింది. మార్కెట్ లో పలు బ్రోకరేజ్ సంస్థలు టెస్లా షేరు పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెడ్బష్ ప్రకారం, టెస్లా రోబో టాక్సీ సేవల ద్వారా కంపెనీకి భవిష్యత్తులో ఒక ట్రిలియన్ డాలర్ల వరకు విలువ చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. కానీ మరోవైపు వెల్స్ ఫార్గో సంస్థ మాత్రం టెస్లా షేరు ధర మళ్ళీ 50 శాతం పడిపోవచ్చని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా భద్రతా అంశాలపై ప్రజల్లో ఇంకా నమ్మకం నెలకోలేదని, రెగ్యులేటరీ అనుమతుల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎలాన్ మస్క్ చేపట్టిన ఈ రోబో టాక్సీ ప్రయోగం వాణిజ్యరంగంలో ఎంత మేరకు విజయవంతమవుతుందో, ప్రజలు ఈ సేవలను ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. రోబో టాక్సీల భద్రత, విశ్వసనీయత టెస్లా భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారనున్నది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే టెస్లా మరోసారి ప్రపంచ మార్కెట్ లో తన ఆధిపత్యాన్ని చాటే అవకాశం ఉంది. అదే అపజయమైతే టెస్లా షేరు ధర మళ్ళీ కిందకు పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఈ టెస్లా రోబో టాక్సీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ టెస్లాకు ఎంత వృద్ధి ఇస్తుందో చూడాలి.