Telangana: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. రైతులకు ఎరువుల కొరత, ధరల పెరుగుదలపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ‘రైతులు ఆధార్ కార్డులు ఇచ్చినా… కనీసం ఓ బస్తా ఎరువూ ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ లేదు, భరోసా లేదు.. కనీసం వ్యవసాయం చేయాలన్నా అప్పు తెచ్చుకుని చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉందని, ఇది ఎలా వచ్చిందో ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. యూరియా బస్తా ధర రూ.266.50 నుంచి రూ.325కి ఎలా పెరిగిందో కూడా వివరణ ఇవ్వాలన్నారు. ఇంత భారీగా ధరలు పెరగడం వెనుక బ్లాక్ మార్కెట్ దందా ఉందంటూ ఆరోపించారు. ఈ దందాను నడిపిస్తున్నది ఎవరు? ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఎరువులు ముందస్తు బుక్ చేయడంతో పాటు కృత్రిమ కొరత సృష్టించడంలో ఎవరి ప్రమేయముందో తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతుల సమస్యల పరిష్కారంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎరువుల లభ్యత, ధరలు, సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.