గల్ఫ్ కార్మికుల పక్షాన ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలే దాడి చేశారన్న ప్రశాంత్ రెడ్డి
Telangana: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కొందరు కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నిలదీసిన వెంటనే దాడికి దిగడమే ఆందోళనకరం అని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తే.. దాడి చేయడమా?
“గత ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నేను గుర్తు చేశాను. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్‌ఆర్‌ఐ బోర్డు ఏర్పాటు, టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి… ఇప్పటి వరకు అమలు చేయలేదు. చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరాను,” అని అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి.
“ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం నా బాధ్యత. కానీ దీన్ని కొందరు రాజకీయంగా తీసుకుని మా ఇంటిమీద దాడికి దిగారు. కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి మా ఇంటికొస్తా అని సవాల్ విసిరి, ఈ రోజు కొంతమంది నాయకులతో వచ్చి దాడి చేశారు,” అని ఆయన ఆరోపించారు. “కేవలం నేను గల్ఫ్ కార్మికుల పక్షాన మాట్లాడానని, మా ఇంట్లోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నాయకుడు దేవేందర్ రెడ్డి, అతని అనుచరులతో కలిసి చొరబడి మా కుటుంబ సభ్యులపై దాడికి దిగారు,” అంటూ తీవ్రంగా మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి.

“మీరు మా ఇంటిపై దాడి చేసినా, మేము ఎప్పుడూ మీ ఇంటికి వెళ్లలేం. గత పదేళ్లలో మా కేసీఆర్ గారి మీద, నాపై మానాల మోహన్ రెడ్డి చేసిన విమర్శలు గుర్తున్నాయి. కానీ మేము ఇలాంటివి చేయలేదు. ఇది సమాజానికి సరైన సందేశమా?” అని ప్రశ్నించారు మాజీ మంత్రి.
ప్రజల సమస్యలే అసలైన రాజకీయాలు
“ఇలాంటి దాడులు ప్రజలకు ఒరిగేదేమీ కావు. గల్ఫ్ కార్మికుల సమస్యలు అసలు విషయం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల తరపున ప్రశ్నించటమే నా ధర్మం. ఇది నాకు ప్రజలు ఇచ్చిన హక్కు,” అని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే, ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకుడు దేవేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నేతలు పరిగెత్తిస్తూ కొడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పోలీసులు నిలువరిస్తున్నా అతని చొక్కా చింపేసి తీవ్రంగా దాడి చేసినట్లు విజువల్స్ కనిపిస్తున్నాయి. దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ఈ దాడిని ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలు ఖండించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో బాల్కొండలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
