Telangana, జూన్ 9: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ విచారణ జరుగుతోంది.
సమాచారం ప్రకారం, దాదాపు గంటన్నర పాటు ప్రభాకర్ రావును పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తం విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారని సమాచారం. అధికారులు అడిగిన ప్రత్యేకమైన ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఎలా స్పందించారన్నది ఇంకా బయటపడాల్సి ఉంది.
విచారణలో ప్రధానంగా కొన్ని కీలకాంశాలపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను ఎలాంటి పాత్ర పోషించారన్న విషయంపై స్పష్టత కోరారు. కేసు నమోదు అయిన వెంటనే విదేశాలకు వెళ్లిన కారణం ఏమిటో వివరించమన్నారు. తన రాజీనామా చేసిన రోజే హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంపై కూడ ప్రశ్నలు ఎదుర్కొన్నట్టు సమాచారం.
ప్రణీత్ రావు తన ఆదేశాలతోనే హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు చెప్పిన స్టేట్‌మెంట్ ఉందని గుర్తుచేసి, దీనిపై ప్రభాకర్ రావు నుండి స్పందన కోరారు. అలాగే స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్ ఏర్పాటుకు సంబంధించి, గత ప్రభుత్వ నేతల ఆదేశాల నేపథ్యంలోనే ఈ టీమ్ ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలను అధికారులు సంధించినట్టు తెలుస్తోంది.
కేసులో ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం నాలుగు వేలకుపైగా ఫోన్ నంబర్లు ట్యాపింగ్‌కు గురైనట్లు సమాచారం. ఈ నెంబర్లు ఎవరిచ్చారో, ఎలాంటి ఆదేశాల మేరకు పని జరిగిందో వివరించాలని అధికారులు కోరినట్టు సమాచారం. ఇప్పటివరకు అరెస్ట్ అయిన అధికారుల స్టేట్‌మెంట్స్ లో ప్రభాకర్ రావు పేరు పదేపదే రావడాన్ని కూడా ప్రశ్నల్లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
అంతేకాదు, ఎన్నికల ఫలితాల రోజు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడం కుట్రా? ముందే ప్రణాళిక ప్రకారమే జరిగిందా? అనే కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రవణ్ రావు అనే ప్రైవేట్ వ్యక్తి తో ఎస్‌ఐబీ సంబంధం ఏమిటి? అనే అంశంపైనా ప్రశ్నలు ఎదురైనట్టు తెలుస్తోంది.
అత్యంత సున్నితమైన అంశంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లు కూడా ట్యాపింగ్‌కి గురయ్యాయా? ఈ చర్య వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయా? అనే కోణాన్ని కూడా పోలీసులు వివరణ కోరినట్టు సమాచారం.
అంతేకాదు, ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో ముఖ్యంగా విపక్ష నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేయడం, పోలీసుల చేత డబ్బుల సీజ్ చేసే పనిలో ప్రభాకర్ రావు ప్రమేయం ఉన్నాయా? అన్న అంశంపైనా విచారణ సాగినట్టు తెలుస్తోంది.
అమెరికా నుంచి భారత్‌కు నిన్న తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు ఈ కేసులో కీలకం. ఆయన నోరు విప్పితే ప్రధాన నేతలు జైలుకు వెళ్లక తప్పదని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ విచారణ మరింత కీలకంగా మారింది. దీంట్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Telangana Phone Tapping Case | Phone Tapping Case Telangana | Former SIB Chief Prabhakar Rao | Telangana Phone Tapping News in Telugu | Jubilee Hills Police Station Investigation | Prabhakar Rao Police Inquiry | BRS Party