తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి చోటు దక్కింది. దాదాపు ఏడాది కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ సస్పెన్స్‌కు తెరపడింది. కొత్త మంత్రులుగా ముగ్గురితో ఈరోజు రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తొలుత ఆరుగురు సభ్యులను మంత్రులగా తీసుకుంటారనే ప్రచారం జరిగినా.. చివరికి పలు వివాదాల దృష్ట్యా ముగ్గురికే స్థానం కల్పించారు. ఇందులో సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి చోటు దక్కింది. వీరితో పాటు శాసనసభ ఉపసభాపతిగా రామచంద్రు నాయక్‌కు అవకాశం కల్పించారు.
కొత్తగా మంత్రులుగా ఎన్నికైన వారికి అభినందనలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే, ఆరు స్థానాలు ప్రస్తుత తెలంగాణ కేబినేట్‌లో ఖాళీగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు ముందు కొందరికి స్థానం కల్పించి, కొందరికి కల్పించకపోతే అది పార్టీకి నష్టం కలగొచ్చనే ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 20 మందికి పైగా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వారందరినీ సంతృప్తి పరచలేకపోతే అది రాబోయే లోకల్ ఎన్నికల్లో ప్రభావం పడుతుందనే ప్రస్తుతానికి ఏ ఇబ్బందీ ఉండని మూడు సామాజికవర్గాల నుంచి ముగ్గురు నేతలను ఎంపిక చేశారని సమాచారం. పంచాయతీ ఎన్నికల తర్వాత మిగతా స్థానాలను ప్రకటించనున్నారు.