Telangana: కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) బీఆర్ఎస్ పార్టీ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో తనను పార్టీ నుంచి బయటకి పంపించేందుకు కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయంగా ఆమే బహిరంగంగా వాపోయారు. ఈ మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా ఆ పార్టీ నాయకుల ప్రస్తుత ధోరణి మరింత బలం చేకూర్చుతోంది. (Kalvakuntla Kavitha New Party)
ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. కవితను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అధికార కాంగ్రెస్ మంత్రులే మండిపడినా.. ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడే కాదు కవిత సొంత అన్న కేటీఆర్(KTR Tweet) సైతం స్పందించలేదు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణలోనూ ఈ విషయానికి సంబంధించిన వార్తలు ప్రచురించలేదు. దీనిపై సైతం కవిత తన చుట్టూ ఉన్నవాళ్లతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పార్టీ నుంచి బయటకి వస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సొంత చెల్లిని అంత మాటన్నా స్పందించరా?
మాజీ మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమాల్లో ఎంత ఆక్టివ్‌గా ఉంటారో ప్రత్యేక వివరణ అవసరం లేదు. రాష్ట్రంలో, దేశంలో ఏం జరిగినా వెంటనే స్పందిస్తుంటారు. ఇండియన్ మహిళా రెజ్లర్ల వేధింపుల నుంచి మొన్న హైదరాబాద్ కేంద్రంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో బ్రిటన్ కంటెస్టెంట్ మిల్లా మ్యాగీకి వేధింపుల దాకా.. ఆరోపణ వినిపించినా తనదైన శైలిలో రియాక్షన్ ఉంటుంది. గతంలో ఫామ్ హౌజ్ పార్టీలో ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ప్రచారంలో ఉన్నాయని, రేవతి అనే ఓ మహిళా జర్నలిస్టు అరెస్టు.. ఇలా అనేక సందర్భాల్లో మహిళల తరఫున మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లోనూ మహిళా కోటా కోసం తన స్థానాన్ని సైతం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, మొదటి నుంచీ మహిళలపై తన సానుభూతిని ప్రకటించే కేటీఆర్.. తన సొంత చెల్లి కవిత విషయంలో మాత్రం మౌనం వహించడంపై విమర్శలు తీవ్రమవుతున్నాయి.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల ఓ బీసీ సభలో ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ కంచం పొత్తు.. మంచం పొత్తు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇది తప్పుడు ఉద్దేశంతో అన్నది కాదని మల్లన్న ప్రకటించినా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ జాగృతి నేతలు మల్లన్న కార్యాలయం ధ్వంసం చేయడంతో పాటు అధికార కాంగ్రెస్ మంత్రులు, నేతలూ మల్లన్న మాటలపై మండిపడ్డారు.
ఆడబిడ్డల విషయంలో ఈ మాటలు వాడటం ముమ్మాటికే తప్పేనని ముక్త కంఠంతో ఖండించారు. ఆఖరకు బీజేపీ నేతలు సైతం ఈ వివాదంలో కవితకు మద్దతుగా నిలిచారు. కానీ, బీఆర్ఎస్ పార్టీగానీ, ఆ పార్టీ మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు.. కవిత సొంత సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఓ ట్వీట్ కాదు కదా.. తన స్పందన ఎక్కడా వినిపించలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత మధుసూదనా చారి స్పందించినా.. ఆ వార్త నమస్తే తెలంగాణలో కనిపించకపోవడం గమనార్హం.
షర్మిళ ఎపిసోడ్ రిపీట్!
ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తన సోదరుడు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వ్యతిరేకించి బయటకొచ్చారు షర్మిళ. అయితే, ఆమె పార్టీలోనే ఉన్నానని పలుమార్లు ప్రకటన చేస్తున్నా.. ఆ పార్టీ పత్రిక, ఛానల్ సాక్షి మాత్రం ఆమెపై విషం కక్కే ప్రయత్నం చేశాయి. తీవ్ర ఆరోపణలొచ్చినా, ఎంత దాడి జరిగినా, ఆమె మాటలను సైతం ఆ పత్రికలో ప్రచురించలేదు. కొంతమంది నేతలతో ప్రెస్‌మీట్లు పెట్టించారు. అదే సమయంలో షర్మిళ.. అప్పటి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ దాదాపు అదే ఎపిసోడ్ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

వచ్చేస్తారా..? ముంచేస్తారా..?
బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ తనదేనని ఇప్పటికే కవిత స్పష్టం చేశారు. కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని ప్రకటించారు. అయితే, ఆమె అరెస్టు సమయంలో పార్టీ స్టాండ్ నుంచి మొదలు మొన్నటి ప్రచారాలు, ఆరోపణలు, ఇప్పటి పరిస్థితులన్నింటి వెనకా మాజీ ఎంపీ సంతోష్ ఉన్నారని కవిత చెప్పకనే చెప్పుకొస్తున్నారు. కొద్దిరోజులుగా ఆమె బీసీ సామాజిక వర్గాలతో ఓ పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉన్నట్టుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గొంతు మారింది. ఎన్నికలకు ముందు బీసీ ప్రచారం చేసినా.. ఇప్పుడు కవిత బీసీ నినాదం ఎత్తుకోగానే మల్లన్న సైతం తీవ్రస్థాయిలో బీసీ ఉద్యమాన్ని నెత్తినెత్తుకుంటున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ మద్దతు ఉన్నా.. ఇప్పుడు మల్లన్ననూ ఆ పార్టీ పక్కన పెడుతున్నట్లే కనిపిస్తోంది.

మల్లన్న వెనక కేటీఆర్ ఉన్నారనే ప్రచారమూ జోరుగా సాగుతోంది. కవితను ఒంటరి చేయాలనే లక్ష్యంతోనే కేటీఆర్ రాజకీయ పావులు కదుపుతున్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్‌కు వెళ్లలేక, ఇటు బీజేపీకి దగ్గరవ్వలేక, ఉన్న బీఆర్ఎస్‌లో గౌరవం లేక పాలుపోని స్థితిలో ఉన్న కవితకు ఇప్పుడు కొత్త పార్టీతో వచ్చే జోష్‌ను ముందే తుంచేసేందుకు పకడ్బంధీ ప్రణాళికలు తెరవెనుక జరుగుతున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో కవిత పార్టీ వదలి బయటకి వస్తారా లేకా తనను ఇబ్బంది పెట్టిన పార్టీని ముక్కలు చేస్తారా అన్నదే కొందరు బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న ఆందోళన. ఇవన్నీ ప్రస్తుతం ప్రచారాలే అయినా.. కల్వకుంట్ల కవిత తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఆధారపడి ఉన్నదనేది వాస్తవం. ఆమె నిర్ణయం ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలపైనా ప్రభావం చూపనుందనేది విశ్లేషకుల మాట.
అడుగు పడింది..
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ను వీడతారని ఈ కథనం రాసే సమయానికి ఓజీ న్యూస్ చెప్పిన మాటలకు బలమిస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏళ్లుగా కవిత గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతూ.. తన బలంగా భావిస్తోన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని తనకు దూరం చేశారు. ఈ సంఘానికి ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు అప్పజెప్తున్నట్లు బుధవారం ప్రకటించారు. కవితకు ఆది నుంచీ సింగరేణిపై పట్టుంది. జాగృతిని బలోపేతం చేయడంలోనూ ఇక్కడి టీబీజీకేఎస్ కీలకంగా నిలిచింది. ఇటీవల బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేసిన అనంతరం సైతం.. జాగృతి సమావేశాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు కవిత. అలాంటి చోట ఆమెకు ప్రాతినిధ్యం తగ్గిస్తూ.. ఆ కార్మిక సంఘాన్ని తనకు దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఆమెకు ఉద్వాసన కల్పించినట్లు తెలుస్తోంది.
ఈనెల 23న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా.. దీనికి ముందే మరిన్ని సంచలనాలు చోటుచేసుకోనున్నాయి.
(మొదట రాసిన కథనానికి అదనంగా ఈ చివరి ప్యారా కలపడం జరిగింది. ఓజీ చెప్పినట్టుగానే కేసీఆర్ తనయ.. తన తండ్రి, కుటుంబ పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నాలు మరింత వేగవంతమయ్యాయని కేటీఆర్ తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తోంది.)
