
Hyderabad: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకంగా అందించేందుకు నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో.. ఎవరైనా దివ్యాంగులను వివాహం చేసుకుంటే రూ.లక్ష ఆర్థిక సాయం అందేది. అయితే, అందులో ఎవరో ఒకరు మాత్రమే దివ్యాంగులు అయితే ఈ సాయం అందుతుందని ఉత్తర్వుల్లో ఉండటంతో ఇద్దరు దివ్యాంగులు అయిన జంటలకు సాయం దక్కలేదు. దీనిపై దివ్యాంగులు మంత్రి సీతక్కను సంప్రదించారు. పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సీతక్క.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయానికి సీఎం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.
ఎవరు అర్హులు..?
ఈ పథకం పొందేందుకు వధూవరులు ఇద్దరు దివ్యాంగులై ఉండటంతో పాటు ఇద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. స్థానికులై ఉండటంతో పాటు.. వధువుకు కనీసం 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. మీసేవలో దరఖాస్తు అనంతరం స్థానిక గ్రామ అధికారి క్షేత్రస్థాయి పరిశీలన, మండల రెవెన్యూ అధికారి ధ్రువీకరణతో దరఖాస్తుదారులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందనుంది. దీనిపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.