“బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోరాటానికి, వాగ్దాటికి.. కవిత ధీరత్వానికి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. భారత రాజకీయాల్లో ఒక అసాధారణమైన, దృఢమైన నాయకురాలు మమతా బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి అనుబంధ సంఘమైన ఛాత్ర పరిషత్ ను ఏర్పాటు చేసి, విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. కల్వకుంట్ల కవిత కూడా 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో కృషి చేశారు.”

వ్యాసకర్త:- కరుణాకర్ కాశెట్టి, సీనియర్ జర్నలిస్ట్, (+91 9393642575)
కేసీఆర్(KCR) తనయ.. కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల తీరుపై ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆమె త్వరలో.. కొత్త పార్టీ పెట్టబోతున్నారని, జూన్ 2న ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. తాజా మీడియా చిట్ చాట్ లో కూడా కవిత అడుగులు సొంత పార్టీ వైపే అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సొంత పార్టీ పెడితే.. కవిత సక్సెస్ కాగలరా? బీసీ రిజర్వేషన్లు, సామాజిక తెలంగాణ, తెలంగాణ జాగృతి ఆమెను తీరానికి చేర్చగలవా? అనే చర్చ మొదలైంది.
భారతదేశ రాజకీయ చరిత్రలో సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపించి, బయటకు వచ్చి, సొంత పార్టీని స్థాపించిన లేదంటే ఇతర పార్టీల్లో చేరిన మహిళా నాయకులు చాలా మంది ఉన్నారు. వారిలో చాలా మంది వరకు విజయం సాధించారు కూడా. తమిళనాడు(Tamilanadu)లో AIADMKలో ఎం.జి. రామచంద్రన్ తర్వాత నాయకత్వ వివాదాలు ఏర్పడినప్పుడు.. జయలలిత పార్టీలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. అంతర్గత విభేదాలను అధిగమించి, పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా పార్టీని స్థాపించకపోయినా, పార్టీలోని అంతర్గత ధిక్కారాన్ని ఎదుర్కొని నాయకురాలిగా నిలిచారు.

కాంగ్రెస్(Congress) లోనే ఉన్నప్పటికీ పార్టీలోని సిండికేట్ సీనియర్ నాయకులతో విభేదించి బలమైన నాయకురాలిగా ఎదిగిన ధీర వనిత ఇందిరా గాంధీ(Indira Gandhi). రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసినందుకు ఇందిరా గాంధీని 1969 నవంబర్ 12న కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తే.. ఆమె కాంగ్రెస్ (ఆర్) ను స్థాపించారు. చివరికి అదే అసలు కాంగ్రెస్ గా మారింది. ఇది ఒక రకంగా పార్టీలో ధిక్కార స్వరం వినిపించి, సొంత బలాన్ని చాటుకోవడమే.
బీజేపీ(BJP) నాయకురాలిగా ఉన్న ఉమా భారతి, పార్టీతో విభేదించి భారతీయ జనశక్తి పార్టీని స్థాపించారు. అయితే, ఆ తర్వాత ఆమె మళ్ళీ బీజేపీలో చేరారు. ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన నందిని సత్పతి కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఒక దశలో బయటకు వచ్చి, ఉత్కళ్ కాంగ్రెస్ అనే ప్రాంతీయ పార్టీలో చేరారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లో తన తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణం తర్వాత మెహబూబా ముఫ్తీ నాయకత్వం చేపట్టారు. పార్టీలో ఆమె పాత్ర, నాయకత్వ శైలి అంతర్గత విభేదాలకు దారితీసింది. అయితే ఆమె పార్టీని విడిచిపెట్టలేదు, కానీ తనదైన శైలిలో పార్టీని నడిపించారు. అయితే, సొంత పార్టీని స్థాపించి, దాన్ని విజయవంతంగా నడిపిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు.
అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benarjee) పోరాటానికి, వాగ్దాటికి.. కవిత ధీరత్వానికి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. భారత రాజకీయాల్లో ఒక అసాధారణమైన, దృఢమైన నాయకురాలు మమతా బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి అనుబంధ సంఘమైన ఛాత్ర పరిషత్ ను ఏర్పాటు చేసి, విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. 1970 దశకంలో కాంగ్రెస్ యువజన విభాగంలో చేరి, అతివేగంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని పొందారు. మమతా బెనర్జీ లాగే.. కల్వకుంట్ల కవిత కూడా 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో కృషి చేశారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ కోల్‌కతా నియోజకవర్గం నుంచి గెలిచి, మమతా బెనర్జీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే.. 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో కవిత కూడా నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మమతా బెనర్జీ కేంద్ర మంత్రిగా వివిధ శాఖల బాధ్యతలు చేపడితే.. కల్వకుంట్ల కవిత కూడా ఎంపీగా పార్లమెంట్ లో వివిధ శాఖల స్టాండింగ్ కమిటీ మెంబర్ గా పనిచేశారు.

పశ్చిమ బెంగాల్(West Bengal) లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వం తీరు, వామపక్షాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాన్ని చేయడంలో వైఫల్యం, తదితర కారణాలతో మమతా బెనర్జీ కాంగ్రెస్ అధిష్ఠానంతో విభేదించి కాంగ్రెస్ ను కాదని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనే సొంత పార్టీని స్థాపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో బలమైన పోరాటం చేయడంలో పార్టీ అధిష్టానం విఫలమవుతోందని బలంగా చెబుతున్న కల్వకుంట్ల కవిత.. సొంత నాయకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో సుమారు 34 సంవత్సరాల పాటు నిరంతరంగా అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ పాలనను మమతా బెనర్జీ కూలదోయడం ఆమె రాజకీయ జీవితంలో అతిపెద్ద విజయం అయితే.. పదేండ్ల పాలన, ఉద్యమకారులు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాల పట్ల తన తండ్రి కేసీఆర్ తీరును లేఖతో ఎండగట్టారు. కేసీఆర్ ముందు మాట్లాడేందుకే సాహసించని గులాబీ తోటలో.. ఏకంగా కేసీఆర్ తప్పులను ఎత్తి చూపి కవిత నిజంగా సంచలనంగా మారారు. సాధారణ జీవితం, ప్రజలతో మమేకం కావడం, వారి కష్టాలను అర్థం చేసుకోవడం లాంటి గొప్ప అంశాలతో బెంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ దీదీగా మారినట్లే.. తెలంగాణ ప్రజలతో మమేకమై.. కల్వకంట్ల కవిత తెలంగాణ దీదీగా మారతారా? వేచి చూడాలి.
#KalvakuntaKavitha #NewParty #TelanganaPolitics #Telangana #BRSParty