Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముందుకు వెళ్లడానికి కూడా కేసీఆర్ చెప్పిన తర్వాతే చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు ఆగిపోవడానికి ప్రధాన కారణం కూడా కేసీఆరేనని ఆరోపించారు. కేసీఆర్ కుట్రల వల్లే తెలంగాణలో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టులు కొట్టుకుపోవడానికి కారణం కేసీఆరే కాదా? అని రేవంత్ ప్రశ్నించారు.
అసెంబ్లీలో చర్చకు రండి..
రాష్ట్ర అసెంబ్లీలో గోదావరి జలాలపై చర్చ పెట్టేందుకు తాము సిద్ధమని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రాజెక్ట్‌ల పేర్లు, ఊళ్ళు మార్చి లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆరోపించారు. నాడు సీమాంధ్ర పాలకులు తెలంగాణను ఎండిన భూమిగా మార్చారని విమర్శలు చేసిన కేసీఆర్ స్వయంగా తెలంగాణ ప్రాజెక్టుల మీద కుట్రలు చేశారని రేవంత్ మండిపడ్డారు.
తాను చంద్రబాబుతో ఉండాలనుకుంటే టీడీపీలోనే ఉండేవాడినని, తెలంగాణ హక్కుల కోసం రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే కాంగ్రెస్ పార్టీలో చేరానని రేవంత్ తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు పరిశీలించి, 18 నెలల తమ పాలనతో పోల్చి చూడాలని సూచించారు. తాను రైతుల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి పదవిని పొందానని రేవంత్ స్పష్టం చేశారు. భూమి చుట్టూ సాగిన తెలంగాణ ఉద్యమం రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
రైతులే మా తొలి ప్రాధాన్యం..
రైతుల కోసం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ఉంచిందని, వ్యవసాయాన్ని దండగ అనే దశ నుంచి పండుగ చేసిన స్థాయికి తీసుకొచ్చామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రైతు భరోసా నిధిని తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, 1600 రైతు వేదికల వద్ద 71 లక్షల మంది రైతులు సంబరాలు చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టు రూ.2 లక్షల లోపు రుణమాఫీని అమలు చేశామని, 25 లక్షల మంది రైతులను అప్పుల నుంచి విముక్తులను చేశామని తెలిపారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని, తాము మాత్రం వరి వేయండి, మేము కొనుగోలు చేస్తామని చెప్పామని గుర్తు చేశారు.

ప్రతి గింజను తాము కొనుగోలు చేశామని, సన్న వరి ధాన్యానికి రూ.500 బోనస్ కూడా ఇచ్చామని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్షీణించిన స్థితికి తీసుకెళ్లారని, రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని తాము స్వీకరించామని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో భూములు అమ్ముకొని తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. హరీష్‌రావుకు మొయినాబాద్‌లో, కేటీఆర్‌కు జన్వాడలో, కేసీఆర్‌కు గజ్వేల్‌లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ విధంగా శ్రీమంతులయ్యారని, రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ వచ్చాకే 60వేల ఉద్యోగాలిచ్చాం..
తాను సీఎం అయ్యాక 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ వివరించాలని ఆయన కోరారు. తాము రైతుల కోసం లక్షా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేసీఆర్ కుట్రలు, కుతంత్రాల వల్లే కృష్ణా నదిపై ఏ ప్రాజెక్ట్ పూర్తికాలేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరిలో కొట్టుకుపోవడానికి అవినీతి కారణమని ఆరోపించారు. “నిన్ను ఉరి తీయాల్సినా తప్పు లేదని రైతులు అన్న మాటలు వాస్తవమే. లక్ష కోట్ల రూపాయలు దోచుకొని వేల కోట్లుగా చేరబట్టారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెడదాం, వస్తావా? తేదీ చెప్పండి, అదే రోజు చర్చ పెడదాం. బనకచర్ల దరిద్రానికి నీవే కారణం. రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది నీవే కదా కేసీఆర్. నీ అల్లుడితో కాదు, నువ్వే చర్చకు రా. స్పీకర్‌కు లేఖ రాయి. కృష్ణా, గోదావరి నీళ్లపై రోజు రోజుకూ చర్చ చేద్దాం. కృష్ణా నదిలో 512 టీఎంసీల నీరు ఏపీకి, 299 టీఎంసీల నీరు తెలంగాణకు ఒప్పుకున్నది నువ్వే కదా. ఏపీ పట్టిసీమ నిర్మించిందీ, రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చింది నీ హయాంలోనే కదా. తెలంగాణకు మరణ శాసనం రాసింది నువ్వే కదా. బీఆర్ఎస్ చచ్చిన పాము.. అది తిరిగి అధికారంలోకి రావదు” అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.
ఏపీకి మీరు సహకరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామని కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పి వచ్చామని తెలిపారు. యువత కోసం రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు తీసుకెళ్లేలా పని చేస్తామని, వచ్చే ఎన్నికల్లో 2033 వరకు కూడా తమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.