Telangana: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి(CPRO)గా డాక్టర్ గుర్రం మల్సూర్ నియమితులయ్యారు. రాష్ట్రంలో గురువారం జరిగిన ఉన్నతాధికారుల బదిలీల్లో.. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న మల్సూర్‌ను సీపీఆర్‌వోగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత సీపీఆర్‌వో సమాచార కమిషన్ మెంబర్‌గా నామినేట్ అవడంతో ఈ కీలక పోస్టు ఖాళీ అవనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన సమాచారం సహా రాష్ట్ర ప్రభుత్వ కీలక పథకాల ప్రచారం, మీడియా అనుసంధానం, ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేర్చడంలో ఈ పోస్టు కీలకం కానుంది. దీంతో ఈ స్థానంలో వివిధ ముఖ్య శాఖల్లో పనిచేసి, పరిపాలనలో దాదాపు నాలుగు దశాబ్ధాల వైవిధ్యమైన అనుభవం ఉన్న ఈ సీనియర్ అధికారికి కీలకమైన ఈ బాధ్యతలు అప్పగించింది సర్కారు. పరిశ్రమల శాఖ, నీటిపారుదల శాఖల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు ఆయనది కీలక పాత్ర. వరల్డ్ బ్యాంక్, జైకా నిధుల సమీకరణలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.
విభిన్న శాఖలు.. విశేష అనుభవం..!
డా. మల్సూర్ వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీతో పాటు కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్‌లో హయ్యర్ డిప్లొమా పూర్తి చేశారు. 1990లో గ్రూప్-1 అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన తన సేవలను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన అనేక కీలక శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
డా. మల్సూర్ తన కెరీర్ ఆరంభంలో కోఆపరేటివ్ శాఖలో పని చేసి, అనంతరం సామాజిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల్లో తన సేవల్ని అందించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్ సీఈఓ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలలో కీలక పదవుల్లో పనిచేశారు.
అంతేకాకుండా, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ (MCH) విభాగంలో సేవలు అందించిన ఆయన, అనంతరం పెద్దపల్లి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో నీటిపారుదల శాఖలో వరల్డ్ బ్యాంక్, జపాన్ జైకా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టారు. కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (CADA) కమిషనర్‌గా పనిచేసిన ఆయన, మైనింగ్ రంగంలో కూడా తన పరిపాలనా నైపుణ్యాన్ని చూపించారు.
డా. మల్సూర్ తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSMDC) లో వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. తరువాత డైరెక్టర్ – ఇండస్ట్రీస్, వాణిజ్య మరియు ఎగుమతి ప్రోత్సాహక శాఖల్లో ముఖ్య బాధ్యతలు చేపట్టారు. అలాగే, తెలంగాణ షుగర్ అండ్ కేన్ కమిషనర్ హోదాలో కూడా వ్యవహరించారు.
సర్కారు ఆయన సేవలను మరింతగా వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) గా నియమించింది. డా. మల్సూర్ కు ఉన్న విస్తృత అనుభవం, వివిధ రంగాల్లో సేవలందించిన దశాబ్దాల పరిజ్ఞానం, ప్రజా సంబంధాల్లో నైపుణ్యం ఈ పోస్టుకు ఆయన్ను ఎంపిక చేసేలా చేశాయి. ఆయన నియామకం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా ప్రజల్లోకి చేరే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల సమస్యలపై తక్షణ స్పందన, అభివృద్ధి పై దూరదృష్టి, పరిపాలనలో నిబద్ధత, విశేష విషయ పరిజ్ఞానం ఇవన్నీ డా. మల్సూర్ కెరీర్ ని ప్రత్యేకంగా నిలబెట్టిన అంశాలు.
ఓజీ న్యూస్ తరఫున డాక్టర్ మల్సూర్‌కి ప్రత్యేక అభినందనలు.