Telangana: తెలంగాణ మంత్రివర్గంలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే ఉన్న మంత్రుల పనితీరు, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గంలో కూర్పులు చేయనున్నారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురికి శాఖలు కేటాయించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులతో వరసగా సమావేశమవుతూ ఈ అంశంపై చర్చలు జరుపుతున్నారు. దీనికి తోడు నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన దిల్లీకి వెళ్లడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
సోమవారం ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో కలిసి జరిగిన సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగినట్లు సమాచారం. ఇందులో మంత్రుల శాఖల కేటాయింపు, పనితీరు, శాఖల్లో మార్పు అంశాలు ప్రధానంగా చర్చించబడ్డాయి.
ఇప్పటికే మంత్రివర్గంలో 12 మంది ఉన్న వేళ, తాజాగా మరో ముగ్గురికి మంత్రిపదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తవారికి ఏ శాఖలు కేటాయించాలన్న దానిపై స్పష్టత కోసమే ఈ సుదీర్ఘ చర్చలు సాగినట్లు తెలిసింది. ముఖ్యంగా ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ వంటి కీలక శాఖల పనితీరు, మంత్రుల వ్యవహార శైలి వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ఆరా తీసినట్టు సమాచారం. (Telangana Cabinet Expansion)
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఇప్పటికే మంత్రుల పనితీరుపై నివేదికను అధిష్ఠానానికి అందించినట్లు చెబుతున్నారు. అలాగే ఇటీవల కూర్చిన పీసీసీ, పెండింగ్‌లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవులపై కూడా చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిన చేరడం, ముఖ్యమంత్రి రేవంత్ సాయంత్రం సునీల్ కనుగోలుతో సమావేశం కావడం కూడా ఈ మార్పులకు దారితీసే సంకేతాలుగా రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

హోంశాఖ దళితులకే..?
ప్రస్తుతం హోం శాఖ సీఎం రేవంత్ దగ్గర ఉంది. అయితే కీలకమైన ఈ శాఖను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పజెబుతారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman)కు కీలకమైన హోం శాఖ అప్పజెప్తే.. ఇద్దరు దళితులకు కీలక పదవులు కట్టబెట్టినట్లు అవుతుందని.. ఒకరు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, ఒకరు హోం మంత్రిగా ఉంటారని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు అడ్లూరి ఎన్ఎస్యూఐ(NSUI) విభాగం నుంచి పార్టీలోనే ఉండటం, రేవంత్‌తో సహా కీలక నేతలందరికీ అనుయాయుడిగా మంచి గుర్తింపు ఉండటం ఆయనకు హోంశాఖ అప్పగించడం లాంఛనంగానే కనిపిస్తుంది. మరోవైపు బీసీ సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌కు ఉపముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి.
మొన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో వివేక్ వెంకట స్వామికి విద్యా శాఖ, వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు బీసీ సంక్షేమ శాఖ అప్పగిస్తారని వినికిడి. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ, వైద్యారోగ్యం, దేవాదాయ, ఆర్థిక, నీటిపారుదల శాఖల్లోనూ మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో రెండు భారీ సభలు!
ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన అంశాలపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ, ఖర్గేలను ఈ సభలకు ఆహ్వానించిన రేవంత్ రెడ్డికి వారు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా రాహుల్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే.. శుక్రవారంలోపే మంత్రుల శాఖల్లో కీలక మార్పులు జరగనున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Telangana Cabinet Reshuffle News | Telangana Ministers New Portfolios | Revanth Reddy Delhi Meetings | Telangana Political Updates 2025