Telangana: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం తెలంగాణలో ఏళ్లుగా కొనసాగుతున్న రోజుకు 8గంటల పనివేళల నిబంధనను మార్చుతూ.. 10గంటల వరకూ పనిచేసుకునేలా ఆదేశాలిచ్చింది. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇది దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాలకు వర్తించదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
48గంటలు మించకూడదు..
రోజుకు 10గంటల దాకా పని వేళల పరిమితికి అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారం మొత్తంలో పనిగంటలను మాత్రం 48గంటలకు కట్టడి చేసింది. ఒకవేళ ఏదేని సంస్థలో వారానికి 48గంటల కంటే ఎక్కవ ఓ ఉద్యోగి పనిచేయాల్సి వస్తే.. సదరు సంస్థ ఓవర్ టైం భత్యాన్ని చెల్లించాలని తెలిపింది. ఈ ఓవర్ టైం పని సైతం త్రైమాసికంగా(మూణ్నెళ్ల పరిధిలో) 144 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. దీంతోపాటు పని ప్రదేశంలో ప్రతీ ఆరు గంటలకు ఓసారి అరగంట పాటు విరామం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విరామంతో కలిపి రోజుకు 12గంటలు మించకూడదని తెలిపింది. దీన్ని ఎవరు ఉల్లంఘించినా ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే సదరు వాణిజ్యం సంస్థపై కఠిన చర్యలు చేపడతామని సర్కారు స్పష్టం చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి ఈ నిర్ణయం తోడ్పడుతుందని తెలిపింది.
నిర్ణయంపై రచ్చ..
వాణిజ్య సముదాయాల్లో పనివేళల సవరణపై తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పనివేళలను పెంచితే కార్మికులపై ఒత్తిడి పెరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. అయితే, ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 10గంటల వరకూ పనిచేయించుకోవచ్చనే అనుమతులిచ్చిన ప్రభుత్వమే వారానికి 48గంటలు దాటొద్దనే నిబంధన పెట్టిందని గుర్తించాలంటున్నారు. ఈ లెక్కన వారానికి ఐదు రోజుల్లోనే అసలు పనిగంటలు పూర్తవుతాయని.. మిగతా ఓవర్ టైం పనికి అదనపు భత్యం ఇచ్చి తీరాలని చెబుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో 8గంటల చొప్పున వారంలో ఆరు రోజులు పనిచేయాల్సి ఉండేదని.. ఓవర్ టైం కూడా ఖాతరు చేసేవారు కాదంటున్నారు.
ఎందుకీ నిర్ణయం..?
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదంతో పెద్ద ఎత్తున కార్మికులు మరణించారు. ఈ ప్రమాదం తర్వాత పని ప్రదేశంలో కార్మికుల భద్రతపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. తక్కువ జీతాలు, కనీస భద్రతా ప్రమాణాలు లేని బతుకులకు అండగా ఉండేందుకు, చట్టాలను పాటించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వారంలో 48గంటల పనితో పాటు నిర్ధారించిన విరామం సమయంతో కార్మికులపై ఒత్తిడి తగ్గుతుందని.. అదనపు పనికి జీతం అందుతుందని సర్కారు భావిస్తోందట. ఏ సంస్థయినా ఉల్లంఘిస్తే కార్మిక శాఖ అధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు అందించవచ్చు.