Tech: భారత్‌లో ఐఫోన్(iphone)ల అసెంబ్లింగ్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న చైనా(China) నిపుణులు వందల సంఖ్యలో సొంత దేశానికి తిరిగి వెళ్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై తాము నిశితంగా పరిశీలన చేస్తూనే ఉన్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ యూనిట్‌లో అసెంబ్లింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో నైపుణ్యం కలిగిన అనేకమంది చైనా టెక్నీషియన్లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఉన్నట్టుండి వెనక్కి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షల కారణంగా యాపిల్ కంపెనీ(Apple) తన ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి భారత్‌కు తరలించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో యాపిల్ వాణిజ్య భాగస్వామి ఫాక్స్‌కాన్(Foxconn) తన భారతీయ యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. అయితే ఇప్పుడు చైనాకు చెందిన నిపుణులు తిరిగి స్వదేశానికి వెళ్తున్నారన్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో, భారత్‌లో ఐఫోన్‌ల తయారీ ప్రక్రియపై దీని ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా మొబైల్ ఫోన్ తయారీకి అవసరమయ్యే పరికరాలను అధికంగా చైనా నుంచే దిగుమతి చేస్తారు. ఈ పరికరాల నిర్వహణ, శిక్షణ, అసెంబ్లీ లైన్ డిజైన్ వంటి కీలక విభాగాల్లో చైనా నిపుణులకు అపార అనుభవం ఉంది. ప్రస్తుతం భారత్ విడిచిపెట్టి వెళ్తున్న నిపుణుల్లో చాలామంది ఫ్యాక్టరీ డిజైన్, ట్రైనింగ్, పరికరాల అమరికలో కీలకంగా పనిచేసే వ్యక్తులే కావడంతో వారి గైర్హాజరీతో తాత్కాలిక ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫాక్స్‌కాన్ యూనిట్ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇది పూర్తిగా యాపిల్ మరియు ఫాక్స్‌కాన్ మధ్య అంశమని, తగిన ప్రత్యామ్నాయాలను వారు ఎంచుకునే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, ఫాక్స్‌కాన్ మాత్రం భారత్‌లో తమ ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. చైనా నిపుణుల తిరోగమనంతో iPhone 17 తయారీపై పెద్దగా ప్రభావం ఉండబోదని, ఇప్పటికే భారత్‌లోని ఫ్యాక్టరీల్లో స్థానిక ప్రతిభను పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో, భారత్‌లో ఐఫోన్‌ల తయారీ స్థిరంగా కొనసాగుతుందా? స్వదేశీయ నిపుణుల శిక్షణపై మరిన్ని నూతన యాజమాన్య మోడల్స్ తీసుకురావాల్సిన సమయం వచ్చిందా? అన్నదానిపై పరిశ్రమలో చర్చలు ప్రారంభమయ్యాయి. తెరవెనుక ఉన్న రాజకీయాలపైనా కేంద్రం ఆరా తీస్తున్నట్లు సమాచారం.
