దుబయ్ ప్రభుత్వ సంస్థ రాకెజ్‌తో టీ కన్సల్ట్ వ్యూహాత్మక ఒప్పందం
హైదరాబాద్‌లో అట్టహాసంగా ExpandME వ్యాపార సదస్సు
TG: తెలుగు వ్యాపారవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను అందించేందుకు TConsult సంస్థ ఆధ్వర్యంలో ExpandME (Expand Middle East) అనే ప్రతిష్టాత్మక వ్యాపార సదస్సు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి 150కి పైగా పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సంస్థ అయిన RAKEZ (రాస్ అల్ ఖైమా ఎకనామిక్ జోన్) మరియు వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (WTITC) మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా తెలుగు వ్యాపారవేత్తలకు రాస్ అల్ ఖైమా ద్వారా గ్లోబల్ మార్కెట్లకు చేరుకొనే మార్గం సులభతరం కానుంది. RAKEZ గ్రూప్ సీఈఓ శ్రీ రమీ జల్లాద్, TConsult చైర్మన్ మరియు WTITC వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ సందీప్ మక్తాల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. RAKEZ భారత ప్రతినిధిగా మొహమ్మద్ హసీబ్ పాల్గొన్నారు. TConsult బృందంలో డైరెక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి వాకిటి, యామిని మద్దుకూరి, శృతికా, మనోసాయి బండారు, భువనా, మనసా, సాయి శ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం RAKEZ లో 30,000కి పైగా అంతర్జాతీయ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో 7,000కి పైగా సంస్థలు భారత్‌కు చెందినవే కావడం గమనార్హం. 2024లో RAKEZలో 13,000 కొత్త కంపెనీలు స్థాపించబడ్డాయి. 2025 మొదటి త్రైమాసికంలో 3,676 కంపెనీలు నమోదయ్యాయి — ఇది 23 శాతం వృద్ధిని సూచిస్తోంది.

ఈ సందర్భంగా రమీ జల్లాద్ గారు మాట్లాడుతూ: “భారతదేశం మా వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది. WTITCతో భాగస్వామ్యం ద్వారా, తెలుగు వ్యాపారవేత్తలు రాస్ అల్ ఖైమా నుండి ప్రపంచ మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు.” అని తెలిపారు.
“ExpandME ద్వారా తెలుగు యువ వ్యాపారవేత్తలకు గ్లోబల్ అవకాశాలను ప్రత్యక్షంగా చేరుకునే వేదికను కల్పిస్తున్నాం. RAKEZతో ఈ ఒప్పందం స్థానిక ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మరో ముందడుగు అని సందీప్ మక్తల పేర్కొన్నారు. ఈవెంట్‌లో RAKEZ ప్రతినిధులతో ప్రత్యక్ష పరస్పర చర్యలు, బిజినెస్ పరిచయాలు, మరియు ప్రత్యేక నెట్‌వర్కింగ్ విందు ఆకర్షణగా నిలిచాయి. ExpandME యొక్క తదుపరి కార్యక్రమాలు పుణె మరియు ముంబయి నగరాల్లో నిర్వహించబడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.