ఫోన్ పేలో లంచాలు… TGSPDCLలో 8 మంది ఇంజనీర్ల సస్పెన్షన్

Share this article

హైదరాబాద్: విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. TGSPDCL పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు ఫోన్‌పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా లంచాలు స్వీకరించినట్లు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

సస్పెండ్‌ చేసిన వారిలో 2 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ADEలు), 3 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (AEలు), 3 మంది సబ్ ఇంజనీర్లు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త కనెక్షన్లు, లోడ్ పెంపు, బిల్లుల సవరణ, సాంకేతిక అనుమతుల వంటి అంశాల్లో డిజిటల్ మార్గాల్లో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్‌పే లావాదేవీల వివరాలను ఆధారంగా చేసుకుని విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

అంతర్గత విచారణ నివేదిక ఆధారంగా తాత్కాలిక సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. కేసు తీవ్రతను బట్టి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల ఇంజనీర్లు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ పెద్ద ఎత్తున సంస్థలకు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజాయితీగా పనిచేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారని వారు అంటున్నారు.

అయితే అవినీతి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నిర్దిష్ట ఆధారాలపై మాత్రమే చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *