Supreme Court: వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటే స్థానికులు వేధిస్తున్నారంటూ కోర్టు మెట్లెక్కిన ఓ సామాజిక కార్యకర్తకు షాక్ తగిలింది. అంత ప్రేముంటే ఇంటికే తీసుకెళ్లండంటూ.. అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం చేసిన సంచలన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లినా.. అక్కడే అదే చేదు అనుభవం ఎదురైంది.
నోయిడాకు చెందిన ఓ వ్యక్తి వీధి కుక్కలకు రెగ్యులర్గా ఆహారం పెడుతూ వస్తున్నారు. అయితే స్థానికులు దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు, “వీధిలో కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే వీటి ఫీడింగ్కు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి. మీకు అంత ప్రేమ ఉంటే ఇంటికే తీసుకెళ్లండి” అని పేర్కొంది.
ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన సదరు పిటిషనర్, మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఇదే అనుభవం ఎదురైంది. “వీధుల్లో కుక్కల వల్ల వాకింగ్ చేసే వారిపై, బైకర్లపై దాడులు జరుగుతున్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆహారం పెట్టడాన్ని నియంత్రించడం తప్పు కాదు. మీకు ప్రేమ ఉంటే, వాటికి మీ ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వండి, అక్కడే ఆహారం పెట్టండి” అని సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునే సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది.
కుక్కల పట్ల ప్రేమ చూపించడంలో తప్పేమీ లేదని, అయితే అది ఇతరుల భద్రతకు ముప్పుగా మారకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా స్థలాల్లో నియమాలు పాటిస్తూ, సమాజానికి ఇబ్బందులు కలగకుండా కుక్కల్ని పోషించాలని కోర్టులు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది.