Srishti Fertility: హైదరాబాద్, జూలై 29: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రత బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
బెయిల్ పిటిషన్‌లో డాక్టర్ నమ్రత తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. గత 35 ఏళ్లుగా తాను వైద్య రంగంలో సేవలందిస్తున్నానని, ఇప్పటివరకు తనపై ఎలాంటి నేరారోపణలు నమోదయ్యాయని లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటనకు సంబంధించి, తెలంగాణ పోలీసులు కేసులు ఎలా నమోదు చేసి తనను అరెస్టు చేశారని ఆమె ప్రశ్నించారు.
అంతేకాకుండా, తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిరాధారమైన ఆరోపణల ఆధారంగా తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడమన్నది తగదు అని కోర్టుకు స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్థితి, వయస్సు, నాన్-బెయిలబుల్ కాకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో తదుపరి విచారణ త్వరలోనే జరుగనున్నట్టు సమాచారం.