SpiceJet: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం తర్వాత విమానాలంటేనే జనాలకు భయం పడుతోంది. రోజుకో చోట ఒక్కో వార్త విమాన ప్రయాణాల్లో భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతోంది. వరసగా విమానాలు సాంకేతిక వైఫల్యాలతో వార్తల్లో నిలుస్తుండగా.. జూలై 1న గోవా నుంచి పూణేకు వెళ్తున్న స్పైస్‌జెట్ (SpiceJet) విమానం సైతం అందులోని ప్రయాణీకులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. విమానం గాలిలో ఎగురుతుండగా ఒక్కసారిగా ఓ విండోకు సంబంధించిన ఫ్రేమ్ ఊడిపోయింది. ఇది గమనించిన ప్రయాణికులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. అయినప్పటికీ, పైలట్ చాకచక్యంగా స్పందించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
స్పైస్‌జెట్ సంస్థ ప్రకటన ప్రకారం, క్యూ400 మోడల్‌కు చెందిన ఆ విమానం ఎగురుతున్న సమయంలో వదులుగా ఉన్న “సన్‌షేడ్ ఫ్రేమ్” (నీడ కోసం ఉపయోగించే విండో ఫ్రేమ్) ఊడిపోయిందని స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం లోపలి భాగానికి మాత్రమే సంబంధించినదిగా, విమానం కేబిన్ ప్రెజర్ మీద ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపింది. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టంచేసింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే సంబంధిత లోపాన్ని సరిచేసినట్టు సంస్థ ప్రకటించింది. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంగా తెలిపింది.
ఇదిలా ఉండగా, ఓ ప్రయాణికుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. విమాన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ వీడియోను డీజీసీఏకు (DGCA) ట్యాగ్ చేశాడు. దీంతో మరోసారి విమానయాన భద్రతపై చర్చ ప్రారంభమైంది. ప్రయాణికుల భద్రతను అగ్ర ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం మళ్లీ స్పష్టమవుతోంది.