Sitaare Zameen Par Review: విలక్షణమైన కథాంశాలకు పేరుగాంచిన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మళ్లీ ఒక సున్నితమైన సామాజిక అంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘తారే జమీన్ పర్’తో ఒక తండ్రిగా కన్నీరు పెట్టించిన ఆమిర్.. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ అనే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాను ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందించగా, ఆమిర్‌తో పాటు అపర్ణా పురోహిత్, రవి భాగ్చండ్కా, బి. శ్రీనివాసరావు కలిసి నిర్మించారు. గతంలో వచ్చిన స్పానిష్ స్పోర్ట్స్ కామెడీ ‘చాంపియన్స్’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. శుక్రవారం (జూన్ 21) ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
కథేంటి?
గుల్షన్ అరోరా (ఆమిర్ ఖాన్) ఒక బాస్కెట్‌బాల్ అసిస్టెంట్ కోచ్. మంచి టాలెంట్ ఉన్నా.. అతనికి అహంకారం ఎక్కువ. సీనియర్లను గౌరవించడు. ఓ రోజు ఒక సీనియర్‌తో గొడవపడి అతన్ని కొడతాడు. దీని వల్ల అతనిపై కేసు నమోదవుతుంది. కోర్టు అతనికి శిక్షగా మూడు నెలలు స్పెషల్లీ ఏబుల్డ్ (వికలాంగ) వ్యక్తులకు బాస్కెట్‌బాల్ కోచింగ్ ఇవ్వాలి అని ఆదేశిస్తుంది. మొదట నిరుత్సాహంగా వెళ్లిన అతను, ఆ టీమ్‌లోని సభ్యులతో క్రమంగా బంధం ఏర్పరుచుకుంటాడు. ఆ అనుబంధం అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఆ మార్పు ఎలా వచ్చింది? వాళ్లతో కలిసి గెలిచిన అతని ప్రయాణం ఏ విధంగా సాగింది? అన్నదే ఈ చిత్ర కథ.
సినిమా ఎలా ఉంది?
సినిమా మొదటి భాగం కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా హీరో కుటుంబ జీవితానికి సంబంధించిన సన్నివేశాలు కొంత బోరుగా అనిపించొచ్చు. అయితే ఇంటర్వెల్ తర్వాత సినిమా పేస్ పుంజుకుంటుంది. కథ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఆమిర్ ఖాన్ మరోసారి తన అభినయ ప్రతిభను నిరూపించుకున్నారు. అహంకారంతో నిండిన కోచ్‌గా ప్రారంభమై, మారిన మనిషిగా ముగిసే గమ్యం వరకు ఆయన పాత్ర మలుపులు బాగానే కనపడతాయి. ఆయన భార్య పాత్రలో జెనీలియా ఒదిగిపోయారు. ఆమె పాత్రకు తగినంత నమ్మకమైన ప్రెజెన్స్ చూపించారు.
దివ్యాంగ నటులు అధరహో..
వికలాంగ పాత్రల్ని పోషించిన నటుల్లో ఆశిష్ పెండ్సే ఆకట్టుకున్నారు. మిగిలిన నటులూ తమ పాత్రలకు తగినంత న్యాయం చేశారు. డైరెక్టర్ ప్రసన్న వారిని చక్కగా హ్యాండిల్ చేసిన తీరు ప్రశంసించదగినది. వాస్థవికంగా కనిపించే భావోద్వేగాలు ప్రతి సన్నివేశంలో కనిపించాయి.
సాంకేతిక విభాగాల్లో ఎలా?
శంకర్–ఎహ్‌సాన్–లాయ్ మ్యూజిక్ సాధారణ స్థాయిలోనే ఉంది. ఒక్కో పాట సందర్భానుసారంగా వచ్చాయి కానీ, ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా లేవు. రామ్ సంపత్ ఇచ్చిన నేపథ్య సంగీతం మాత్రం మంచి ఫీల్ ఇచ్చింది. కెమెరామెన్ జి. శ్రీనివాస్ రెడ్డి విజువల్స్ బాగానే పట్టారు. ఎడిటింగ్ బాగుంది కానీ కొన్నిచోట్ల ట్రిమ్ చేసి ఉండాల్సింది.
తారే స్థాయికి రాలేకపోయినా… తాకే ప్రయత్నం చేసింది
‘తారే జమీన్ పర్’ స్థాయిని ఇది అందుకోలేకపోయినా, ‘సితారే జమీన్ పర్’లో ఆమిర్ మరో మంచి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. సామాజిక అవగాహనతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. కొంత మందికి నెమ్మదిగా అనిపించొచ్చు కానీ, కథను మనసుతో చూడగలిగితే చివరికి నచ్చుతుంది.
ఓజీ రేటింగ్: 2.5/5