Shocking: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకోగా, దాదాపు 2 గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉత్తరప్రదేశ్‌కి చెందిన రావికా సోని అనే యువతి తన కారును రైలు ట్రాక్ మీద నడుపుతూ వెళ్లింది. నాగులపల్లి గ్రామస్థులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా, ఎక్కడా ఆగకుండా ఏకంగా ఏడు కిలోమీటర్ల మేర కారును వేగంగా రైలు పట్టాలపై నడిపిస్తూ ముందుకు వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
రైళ్లు నిలిపివేత – ప్రయాణికులకు ఇబ్బందులు
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది స్పందించి ఆ మార్గంలో నడిచే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన కారణంగా నాగులపల్లి-శంకర్‌పల్లి మధ్య మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసు స్టేషన్‌కి తరలించి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో, ఆమె హైదరాబాద్‌లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసిందని, ఇటీవల జాబ్ కోల్పోయిందని గుర్తించారు.
మానసిక ఒత్తిడి? డ్రగ్స్ ప్రభావం?
పట్టాలపై కారును నడపడం వెనుక ఆమె మానసిక స్థితి, మద్యం లేదా డ్రగ్స్ సేవించిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆమె రిల్స్ కోసం ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె సుమారు 7 కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై కారును నడిపిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రైల్వే సెక్యూరిటీ సిస్టమ్‌పై తీవ్ర ప్రశ్నలు వెలువడుతున్నాయి.