
సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).. తెలుగే కాదు యావత్ భారత సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. అర్జున్ రెడ్డి(Arjun Reddy) నుంచి యానిమల్(Animal Movie) దాకా అతను సృష్టించిన వైల్డ్ బ్రాండ్ అలాంటింది. తన బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో తరచూ ఏదో ఓ వివాదంలో నిలిచే ఈ దర్శకుడు ఇప్పుడు మరోమారు సంచలనంగా మారాడు. అదీ బాలీవుడ్ సీనియర్ నటి దీపికా పదుకుణే(Deepika Padukune)తో. సందీప్ రెడ్డి.. యానిమల్ తర్వాత ప్రభాస్(Prabhas) హీరోగా స్పిరిట్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొన్నటి దాకా దీపికా హీరోయిన్. అయితే, ఇటీవల దర్శకుడితో తలెత్తిన వివాదంతో తను సినిమా నుంచి బయటికొచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ వెంటనే స్పిరిట్ బృందం సైతం.. యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీని తమ హీరోయిన్‌గా ప్రకటించింది.
ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తనతో సినిమా చేస్తున్నట్లు ఒప్పుకుంటే విషయాలన్నీ గుప్తంగా ఉంచేందుకు ఒప్పుకున్నట్టే.. కానీ నువ్వు ఆ పని చేయలేదు. ఓ చిన్న నటుడిని కించపరుస్తూ.. కథను బయటకి చెప్పడమేనా నీ ఫెమినిజం అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు సందీప్. నేను ఒక్కో సినిమా తీసేందుకు, కథ కోసం నా ప్రాణం పెడతాను. సినిమానే నా జీవితం. అది నీకు అర్థం కాలేదు, కాదు.. ఇంకెప్పటికీ అర్థం కాదు కూడా అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈసారి ఇంకో పని చెయ్ కథ మొత్తం చెప్పేసెయ్.. ఎందుకంటే నాకు ఏమాత్రం ఫరక్ పడదంటూ మండిపడ్డాడు. ఫేక్ పీఆర్ గేమ్స్ హ్యాష్ ట్యాగ్ వాడుతూ చేసిన ఈ పోస్టులో ఎక్కడా దీపికా పేరు మెన్షన్ చేయలేదు. అయితే, తనని సినిమా నుంచి తప్పించిన వెంటనే దీపికా బాలీవుడ్ మీడియాకు స్పిరిట్ కథను లీక్ చేశారన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి సీరియస్‌గా స్పందించాడు.