CSK vs PBKS: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో CSK, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కరన్ (Sam Curran) వ్యవహరించిన తీరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సామ్ కరన్ గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడాడు. ఆ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. అయితే సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రిటెయిన్ చేసుకోలేదు. మెగా వేలంలో కూడా అతడి పట్ల ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా సామ్ కరన్ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శనేం చేయలేదు. అయితే బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటాడు. 47 బంతుల్లోనే 88 పరుగులు చేసి చెన్నై భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ పూర్తి కాగానే సామ్ కరన్ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. పంజాబ్ డగౌట్ వైపు చూస్తే ఫోన్ కాల్ అన్నట్టు సంజ్ఞలు (Signs) చేశాడు. అలాగే అతడు అవుటై వెళ్తున్నప్పుడు పంజాబ్ డగౌట్ వైపు చూస్తూ తల ఊపుకుంటూ వెళ్లాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.