ఓ విడాకుల కేసులో కేరళ హైకోర్టు(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారం, నగదును ఆమె ప్రత్యేక ఆస్తిగా పరిగణించాలని తీర్పు వెలువరించింది. విడాకుల విచారణలో భాగంగా తన బహుమతులు, ఆభరణాలు తనకు తిరిగి ఇప్పించాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను కిందికోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును ఆమె హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. అది తన ఆస్తి అని.. తిరిగిచ్చేయాలని స్పష్టం చేసింది.
కలమస్సేరి(Kerala) ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2010లో వివాహం(Wedding) జరిగింది. ఇప్పుడు విడాకుల (Divorce) దరఖాస్తు చేసుకోగా.. పెళ్లి సమయంలో తన కుటుంబం, బంధువుల నుంచి 71 సవర్ల బంగారం అందిందని.. మంగళసూత్రం, ఓ గాజు, చేతి ఉంగరాలు మినహా మిగతాది ఏదీ తనకు ఇవ్వకుండా భద్రపరుస్తామని చెప్పి తన అత్తింటి వారే తీసుకున్నారని కోర్టుకు తెలిపింది. ఆమె వాదన విన్న కోర్టు.. విడాకుల ప్రక్రియలో భాగంగా మిగిలినదిపోనూ 59.5 సవర్ల బంగారం లేదా దాని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నగదు చెల్లించాలని ఆమె భర్త కుటుంబాన్ని ఆదేశించింది.