“ఈ సాలా కప్ నం దే..!” – గత 18 సంవత్సరాలుగా ఆర్సీబీ అభిమానుల ఈ నినాదం ఎట్టకేలకు 2025లో నిజమైంది. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచీ అత్యంత ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు కప్‌ను ఎత్తింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హిస్టారికల్ ఫైనల్‌లో, ఆర్సీబీ, విధ్వంసకర పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ మొదటి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

కట్టడి చేసినా.. గెలుపు దక్కలేదు!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పండగ వాతావరణంలో మొదలైన ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో, RCB ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ – ఫిల్ సాల్ట్ ఆరంభించగా, పవర్‌ప్లేలో సాల్ట్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. కానీ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన యార్కర్‌తో సాల్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ వెంటనే మయాంక్ అగర్వాల్ కూడా చాహల్ బౌలింగ్‌లో గూగ్లీకి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
RCBని నిలబెట్టిన కోహ్లీ ఇన్నింగ్స్
విరాట్ కోహ్లీ తనదైన శైలిలో కొన్ని అద్భుతమైన షాట్లతో అభిమానులను అలరించాడు. అతని 43(34) పరుగుల ఇన్నింగ్స్ టీంను నిలబెట్టింది. మిడిల్ ఆర్డర్‌లో రజత్ పటీదార్, లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ కూడా తమ వంతు స్కోరు చేయగా, చివరికి RCB 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. 200 పరుగులు దాటకపోవడంతో పంజాబ్ దే విజయమనుకున్నారంతా.
పంజాబ్ ఛేజ్.. అడుగడుగునా తడబాటు!
191 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన పంజాబ్(punjab kings eleven) కు ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ చక్కటి ప్రారంభం అందించారు. మొదటి ఐదు ఓవర్లలోనే 43 పరుగులు సాధించారు. అయితే షార్ట్ లెంత్ బంతులతో, యార్కర్లతో హెజల్వుడ్, భువనేశ్వర్, షెఫర్డ్ ఒత్తిడి పెంచారు. ముంబైపై కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ఫైనల్స్ దాకా తీసుకొచ్చిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకే ఔటవ్వడంతో పంజాబ్ పతనం మొదలైంది. వరుస వికెట్లు పడ్డాయి. మ్యాచ్ ను తమవైపు తిప్పుకునేందుకు శశాంక్ సింగ్ పోరాటం చేసినా, మిగతా ఆటగాళ్లు RCB బౌలర్ల దాటికి నిలవలేకపోయారు.
17.3 ఓవర్లలో పంజాబ్ స్కోరు: 146/7. ఆ తర్వాత శశాంక్ కొడతాడనే ఆశలు చివరి రెండో ఓవర్ దాకా ఉన్నా.. బెంగళూరు బౌలింగ్ దాటికి అది సాధ్యపడలేదు. చివరికి ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.

భావోద్వేగాల విజయమిది..!
18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయంతో స్టేడియంలో అభిమానుల అరుపులతో అహ్మదాబాద్ దద్దరిల్లింది. గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli) కంటతడి పెట్టడం అభిమానులను కదిలించింది. దిగ్గజ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివీలియర్స్ ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
