ఒకడు అత్యాచారం చేసి.. వీడియో తీసి తన స్నేహితులకు పంపాడు. ఆ స్నేహితులు ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారం చేశారు. ఇలా ఒకడి వెనక ఒకడు.. దాదాపు ఇరవై మంది మనిషి పుట్టుకనే మరిచిపోయారు. రెండేళ్లుగా అతి దారుణంగా ఓ ఎనిమిదో తరగతి దళిత బాలికపై దుర్మార్గానికి ఒడిగడుతూ నరకం చూపించారు. ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ చేయించారు. ఇప్పుడు మరోసారి గర్భం దాల్చిందా బాలిక. ఈ నరకం చూడలేక ఆ ఊరి పంచాయతీని ఆశ్రయించిందా కుటుంబం. తనకు న్యాయం చేస్తామని చెప్పిన పెద్ద మనిషి ముసుగేసుకున్న పశువులూ బాలికను వదల్లేదు. మరోసారి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొడుకు తప్పు చేశాడని తండ్రికి చెబితే.. ఆ వీడియో చూసిన తండ్రి కూడా అదే పని చేయడం సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తోంది. సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలంలో జరిగిందీ దారుణ ఘటన.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో మైనర్ల నుంచి ముసలి వాళ్ల దాకా ఉన్నారు.
ఏం జరిగిందంటే..?
రెండేళ్ల క్రితం.. రామగిరి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న ఓ దళిత బాలికకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని వీడియో తీసి తన స్నేహితులకు ఫార్వార్డ్ చేశాడు. ఈ వీడియోను బాలికకు చూపించి బ్లాక్‌మెయిల్ చేసిన అతడి స్నేహితుడు ఆ బాలికపై మరోసారి దారుణానికి పాల్పడ్డాడు. ఇలా వాట్సాప్‌లో ఒకరికి ఒకరు ఫార్వార్డ్ చేసుకుంటూ దాదాపు రెండేళ్లుగా విడతల వారీగా ఆమెపై బలత్కారానికి పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రెండుసార్లు గర్భం దాల్చడంతో బలవంతంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. ఇప్పుడు మరోసారి గర్భం దాల్చిందా బాలిక. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు గ్రామ పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు.
పంచాయతీలో పశువులు..!
బాలికపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు న్యాయం కోసం గ్రామ పెద్దల వద్దకు వెళ్లారు. కానీ న్యాయం చేయాల్సిన వాళ్లు కూడా దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పంచాయితీ పేరుతో బాలికను మోసం చేసి మరోసారి లైంగిక దాడులకు పాల్పడ్డారట. అయితే, ఈ బాలికపై లైంగిక దాడి చేసిన ఓ పెద్ద మనిషి కుమారుడే ఇందులో నిందితుడు కావడం గమనార్హం. తన కొడుకు ఆ బాలికను అత్యాచారం చేసే వీడియోను తన ఫోన్లో పెట్టుకున్న తండ్రి.. న్యాయం చేస్తాననే ముసుగులో ఆమెను మరోసారి వంచించాడు.
బయటకి రాకుండా కొండల్లో దాచేశారు..!
ఈ దుర్మార్గం బయటపడకుండా ఉండేందుకు బాలిక కుటుంబాన్ని కొండగుట్టల మధ్య గుట్టుచప్పుడు కాకుండా దాచి ఉంచినట్లు తెలుస్తోంది. కానీ సమాచారం పోలీసుల దృష్టికి రావడంతో వారు వెంటనే చర్యలు తీసుకున్నారు. బాలిక కుటుంబాన్ని గుర్తించి, వారికి వైద్య సహాయం అందించేందుకు అనంతపురంలోని సత్య కేంద్రానికి తరలించారు.
పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిబంధనలతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. మంగళవారం నాడు అచ్చంపల్లి వద్ద తలారి మురళి, పడగొల్లు నందవర్ధన్, నాగరాజు, సంజీవ, రాజన్న, రంగన్న అనే ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. ప్రస్తుతం బాలికకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించామని, వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిందితులెవరైనా ఒడిసిపట్టి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
POCSO case Andhra Pradesh, Dalit girl abuse case 2025, Child sexual abuse in villages, Andhra Pradesh crime news, Ramagiri molestation incident, Rape on girl, Andhra pradesh News