Rains: రాష్ట్రవ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు.. వానలు పడుతూనే ఉన్నాయి. ఇప్పట్లో వానలు తెరిపినివ్వవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వీడని ముసురు..
బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
గురువారం ఇలా..
గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చింది.
శుక్రవారం వర్షం పడే జిల్లాలు:
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం భారీ వర్షాలు..
శనివారం వర్షాల ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ మొత్తం మీద ఎక్కువ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.

ఎల్లో అలర్ట్ జారీ
ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
గడచిన 24 గంటల్లో వర్షాల రికార్డు:
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. టీజీడీపీఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం, అత్యధిక వర్షపాతం కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 8.6 సెం.మీ, బూర్గంపాడ్‌లో 7.6 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గార్లలో 8.5 సెం.మీ, బయ్యారంలో 6.4 సెం.మీటర్ల వర్షాపాతం నమోదైంది.